Telangana: 1996 తర్వాత జమ్మూ కశ్మీర్లో తొలిసారి రికార్డ్స్థాయి పోలింగ్
- తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్ సభ స్థానాలు సహా 96 చోట్ల పోలింగ్
- జమ్మూ కశ్మీర్లో ఈసారి 36 శాతం ఓటింగ్ నమోదు
- దేశవ్యాప్తంగా 63 శాతం ఓటింగ్ నమోదు
తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా 96 లోక్ సభ నియోజకవర్గాల్లో ఈరోజు పోలింగ్ జరిగింది. జమ్మూ కశ్మీర్ స్థానంలో 1996 తర్వాత మొదటిసారి పోలింగ్ శాతం పెరిగింది. గత ఎన్నికల్లో ఇక్కడ 14.1 శాతం నమోదు కాగా... ఈసారి 36 శాతం నమోదయింది. 1996లో నమోదైన 41 శాతం ఓటింగ్ తర్వాత ఈసారే అత్యధికం.
రాష్ట్రాలవారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్ (25), బిహార్ (5), ఝార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), తెలంగాణ (17), ఉత్తర ప్రదేశ్ (13), పశ్చిమ బెంగాల్ (8), జమ్మూ కశ్మీర్ (1) చోట్ల ఎన్నికలు జరిగాయి. ఈరోజు ఎన్నికలు జరిగిన 96 స్థానాల్లో తెలుగు రాష్ట్రాల నుంచే 42 ఉన్నాయి.
సాయంత్రం ఐదు గంటల సమయం వరకు ఏపీలో 68.12 శాతం, బిహార్లో 55.90 శాతం, జమ్ము కశ్మీర్లో 36.58 శాతం, ఝార్ఖండ్లో 63.37 శాతం, మధ్యప్రదేశ్లో 68.63 శాతం, మహారాష్ట్రలో 52.75 శాతం, ఒడిశాలో 63.85 శాతం, తెలంగాణలో 61.39 శాతం, ఉత్తర ప్రదేశ్లో 57.88 శాతం, పశ్చిమ బెంగాల్లో 75.94 శాతం ఓటింగ్ నమోదయింది. 96 నియోజకవర్గాల్లో 62.9 శాతం ఓటింగ్ నమోదయింది.