KKR vs GT: వరుణుడి దెబ్బ.. ఐపీఎల్ నుంచి గుజరాత్ ఔట్!
- ఒక్క బాల్ కూడా పడకుండా మ్యాచ్ క్యాన్సిల్
- ఇరుజట్లకూ చెరో పాయింట్
- 19 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల టేబుల్‌లో అగ్రస్థానంలో కోల్‌కతా
- ఈ సీజన్‌లో టోర్నీ నుంచి నిష్క్రమించిన మూడో జట్టుగా గుజరాత్
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సోమవారం జరగాల్సిన కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), గుజరాత్ టైటాన్స్ (జీటీ) మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బాల్ కూడా పడకుండా రద్దయింది. ఇరుజట్లకూ చెరో పాయింట్ లభించింది. దీంతో కేకేఆర్ టేబుల్ లో టాప్‌ప్లేస్‌కు చేరుకుంది. మరోవైపు గుజరాత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం జీటీకి 11 పాయింట్లు ఉన్నాయి. తర్వాతి మ్యాచ్ సన్‌రైజర్స్‌తో గెలిచినా 13 పాయింట్లే అవుతాయి. దీంతో గుజరాత్ టైటాన్స్ అధికారికంగా లీగ్ నుంచి ఎలిమినేట్ అయింది. దీంతో ఈ సీజన్‌లో టోర్నీ నుంచి నిష్క్రమించిన మూడో జట్టుగా గుజరాత్ నిలిచింది. జీటీ కంటే ముందే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే.
ఇక మునుపటి మ్యాచ్‌లో ముంబైను మట్టికరిపించిన కోల్‌కతా ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 13 మ్యాచులు ఆడిన కేకేఆర్ 19 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల టేబుల్‌లో అగ్రస్థానానికి చేరింది. దీంతో క్వాలిఫయర్-1లో కేకేఆర్ పోటీ పడనుంది. మ్యాచ్ రద్దు అయిన వెంటనే సోషల్ మీడియా వేదికగా నైట్‌రైడర్స్ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ట్వీట్ కూడా చేసింది. 'పదేళ్ల తర్వాత తాము క్వాలిఫయర్-1 ఆడబోతున్నామని' తన ట్వీట్‌లో పేర్కొంది.
ఇదిలాఉంటే.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ రెండో స్థానంలో కొనసాగుతోంది. 12 మ్యాచులాడిన ఆర్ఆర్ 16 పాయింట్లు సాధించింది. తన తర్వాతి రెండు మ్యాచుల్లో ఒకటి గెలిచినా ప్లే ఆఫ్స్ చేరుతుంది. అలాగే డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) 13 మ్యాచుల్లో 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) 12 మ్యాచుల్లో 7 విజయాలతో 14 పాయింట్లు సాధించి నాలుగో ప్లేస్‌లో కొనసాగుతోంది. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 13 మ్యాచుల్లో 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. కాగా, ఆర్‌సీబీ తాను ఆడిన చివరి ఐదు మ్యాచుల్లో వరుసగా గెలిచి ఇలా ప్లే ఆఫ్స్ రేసులో నిలవడం విశేషం.