GV Prakash Kumar: 11 ఏళ్ల వివాహ బంధానికి సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ స్వస్తి
- 2013లో గాయని సైంధవితో జీవీ ప్రకాశ్ ప్రేమ వివాహం
- ఎంతో ఆలోచించి చివరికి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడి
- తమిళ్‌తో పాటు తెలుగులో పలు హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన జీవీ ప్రకాశ్ కుమార్
సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్, గాయని సైంధవి తమ 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికారు. తాజాగా ఈ జంట విడాకులు తీసుకుంది. ఈ మేరకు వారు సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంతో ఆలోచించి చివరికి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వారు ప్రకటించారు. కాగా, ప్రకాశ్, సైంధవి 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు అన్వీ ఉంది.
"ఎంతో ఆలోచించి సైంధవి, నేను 11 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాం. మానసిక ప్రశాంతత, ఇద్దరి జీవితాల్లో మెరుగుకోసం ఒకరికొకరం పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం ఇద్దరికీ మంచిదని నమ్ముతున్నాం. మా నిర్ణయాన్ని మీడియా మిత్రులు, అభిమానులు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. మా ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాం" అని తమ ప్రకటనలో పేర్కొన్నారు.
అస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ మేనల్లుడు అయిన జీవీ ప్రకాశ్ కుమార్ తమిళ్‌తో పాటు తెలుగులో పలు హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించారు. 'అసురన్', 'సురరై పోట్రు' (ఆకాశమే నీ హద్దు), 'యుగానికి ఒక్కడు', 'రాజా రాణి' వంటి తమిళ సినిమాలకు బాణీలు అందించారు. అలాగే తెలుగులో 'డార్లింగ్', 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'ఒంగోలు గిత్త', 'జెండాపై కపిరాజు', 'ఎందుకంటే ప్రేమంటా', 'రాజాధిరాజా' చిత్రాలకు సంగీతం అందించారు. ఇక హీరోగా 15 మూవీలలో నటించారు.