Monsoon: చల్లటి కబురు చెప్పిన అమరావతి వాతావరణ శాఖ
- ఈ ఏడాది ముందుగానే భారత్ లోకి ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు
- 19 కల్లా అండమాన్, నికోబార్ దీవుల్లోకి రుతుపవనాల ప్రవేశం
- ఈరోజు ఏపీలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
ఈ వేసవిలో దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సమయంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఈ ఏడాది కాస్త ముందుగానే దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని ప్రకటించింది. మరో ఐదు రోజుల్లో అంటే... ఈ నెల 19 కల్లా దక్షిణ అండమాన్, నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది.
మరోవైపు దక్షిణ కర్ణాటక నుంచి వాయవ్య మధ్యప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు వడగాలుల ప్రభావం ఉండదని వెల్లడించింది. కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిన్న పలు జిల్లాల్లో వర్షం కురిసింది. ప్రకాశం జిల్లా బల్లిపల్లిలో అత్యధికంగా 79 మి.మీ. వర్షపాతం నమోదయింది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది.