Kesineni Chinni: విజయవాడ లోక్సభ పరిధిలో అన్ని స్థానాలూ కూటమికే: కేశినేని చిన్ని
- వైసీపీ ప్రభుత్వంపై కోపంతో ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు వచ్చారన్న చిన్ని
- ఓటమి భయంతో వైసీపీ దాడులకు తెగబడిందని విమర్శ
- కూటమి ఘన విజయం సాధించబోతోందని ధీమా
ఏపీలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తించిన ఎన్నికలు ముగిశాయి. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏపీ ప్రజలు పోటెత్తారు. హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కేవలం ఓటు వేయడం కోసమే విదేశాల నుంచి కూడా తరలి వచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అక్కడక్కడ కొన్ని ఉద్రిక్త ఘటనలు మినహా ఓటింగ్ ప్రక్రియ గతంతో పోలిస్తే ప్రశాంతంగానే ముగిసిందని భావించవచ్చు.
మరోవైపు విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని తాజాగా మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వంపై కసి, కోపం, బాధతో ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చారని చెప్పారు. ఎన్నికల్లో ఓటమి తప్పదనే విషయాన్ని గ్రహించిన వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయంతో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుందని చెప్పారు.