Ambati Rambabu: నిన్న పోలీసు యంత్రాంగం విఫలమైంది... పోలీసులు టీడీపీతో కుమ్మక్కయ్యారా?: అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

Ambati Rambabu sensational comments on police

  • పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి అంబటి
  • టీడీపీ నేతల అరాచకాలపై పోలీసులు స్పందించలేదని ఆరోపణ
  • తమ ఫిర్యాదులు బుట్టదాఖలయ్యాయని ఆక్రోశం

ఏపీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిన్న పల్నాడు జిల్లాలో పోలీసు యంత్రాంగం విఫలమైందని అన్నారు. టీడీపీ నేతలు దారుణాలకు పాల్పడుతుంటే, తాము ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. పోలీసులు టీడీపీతో కుమ్మక్కయ్యారా? అంటూ ప్రశ్నించారు. టీడీపీతో కుమ్మక్కయి పోలీసులు ఫెయిల్ అయ్యారని విమర్శించారు. 

పోలీసులు పక్కా ప్రణాళికతో వ్యవహరించారనడంలో సందేహం లేదని, సత్తెనపల్లి రూరల్ సీఐ రాంబాబు టీడీపీ వాళ్లతో కుమ్మక్కయ్యారని అంబటి రాంబాబు ఆరోపించారు. పోలీసుల అండతో టీడీపీ వాళ్లు తన అల్లుడిపై దాడి చేశారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఎన్నికల సంఘం శాంతిభద్రతల పేరుతో డీజీపీని, ఐజీని, ఇతర పోలీసు ఉన్నతాధికారులను మార్చిందని, కానీ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయా? అని ప్రశ్నించారు.

పోలీసులు తమ కార్యకర్తలకు రక్షణ కల్పించలేదని, తనను సైతం తిరగకుండా అడ్డుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. తనను గృహ నిర్బంధం చేస్తున్నట్టు ఎస్పీ ఆదేశాలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో తన ప్రత్యర్థి (కన్నా) మాత్రం యథేచ్ఛగా అన్ని పోలింగ్ బూత్ లకు తిరిగాడని అంబటి వ్యాఖ్యానించారు.

ఓ నియోజకవర్గంలో దాదాపు వెయ్యి ఓట్లు రిగ్గింగ్ చేశారని అంబటి ఆరోపించారు. రీపోలింగ్ అవసరంలేదని  పేర్కొనడం సరికాదని, నార్నెపాడు, దమ్మాలపాడులోని పలు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని అన్నారు.

  • Loading...

More Telugu News