Jagga Reddy: అప్పుడు మాకు 90 మంది ఎమ్మెల్యేలు అవుతారు... ఆగస్టు సంక్షోభం ఎందుకు వస్తుంది?: బీజేపీ నేతపై జగ్గారెడ్డి ఆగ్రహం
- బీఆర్ఎస్, బీజేపీల నుంచి 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు వస్తారన్న జగ్గారెడ్డి
- తమ బలం 90 సీట్లకు చేరుకుంటుందని వ్యాఖ్య
- హామీలు ఇచ్చి ఎగనామం పెట్టడంలో బీజేపీ నాయకులను మించిన వారు లేరని విమర్శ
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు సంక్షోభం ఎదుర్కొంటుందన్న బీజేపీ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... లక్ష్మణ్ పండితుడిలా జాతకాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఆగస్టులో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడుతుందని ఆయన ఎలా అన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారు అనటంలో అర్థం ఏమిటి? అని ప్రశ్నించారు. 65 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఎందుకు పడిపోతుంది? అని నిలదీశారు. అసలు బీఆర్ఎస్ నుంచి 25 మంది, బీజేపీ నుంచి మరో నలుగురైదుగురు తమ పార్టీలో చేరితే తమకే 90 సీట్లు దాటుతాయన్నారు.
తెలంగాణలో తాము అధికారంలో ఉన్నప్పటికీ, లోక్ సభ ఎన్నికల సమయంలో ఎవరికీ ఇబ్బందులు కలిగించలేదన్నారు. పోలీస్ వ్యవస్థను కూడా దుర్వినియోగం చేయలేదన్నారు. స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నికలు జరిపించటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతమైందన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చే పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. దేవుళ్లను అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ అన్నీ అబద్ధాలే చెబుతోందన్నారు. దేవుడి పేరు చెప్పుకోవడం... కన్ఫ్యూజ్ చేయడమే బీజేపీ అజెండా అని విమర్శించారు.
హామీలు ఇచ్చి ఎగనామం పెట్టడంలో బీజేపీ నాయకులని మించిన వారు లేరన్నారు. మోసం అంటే ఎలా ఉంటుందో కూడా కాంగ్రెస్ పార్టీకి తెలియదన్నారు. చెప్పిన పనిని... ఇచ్చిన మాటను అమలు చేయటం మాత్రమే తమ పార్టీకి తెలుసునని వ్యాఖ్యానించారు. తమ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు మనసు మార్చుకుని రావటం వేరు.. విలీనం వేరు అన్నారు. ఈ విషయంలో లక్ష్మణ్ తప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చారన్నారు. లక్ష్మణ్‌కు పొలిటికల్ చిప్ చెడిపోయినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. కొత్త చిప్ వేసుకొని రావాలని... కావాలంటే దానికి అయ్యే ఖర్చును కూడా కాంగ్రెస్ ఇస్తుందన్నారు.