yawning: ఆవలింత వచ్చిందని పెద్దగా నోరు తెరిచిందంతే.. దవడ లాక్ అయిపోయింది!
- అమెరికాలో ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్ కు వెరైటీ కష్టం
- ఆసుపత్రిలో చికిత్స తర్వాత కోలుకున్న యువతి
- వీడియోను నెటిజన్లతో పంచుకున్న జెన్నా సినాట్రా
అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన జెన్నా సినాట్రా అనే 21 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ కు వెరైటీ కష్టం వచ్చిపడింది. ఆవలింత రావడంతో ఆమె పెద్దగా నోరు తెరవడంతో దవడ ఒక్కసారిగా లాక్ అయిపోయింది. తిరిగి నోరు మూతపడకుండా అలాగే ఉండిపోయింది. దీంతో ఆమె బాధతో విలవిల్లాడింది. అలా నోరు పెద్దగా తెరుచుకొని ఉన్న స్థితిలోనే ఆసుపత్రికి పరిగెత్తింది.
తన సమస్యను వైద్యులకు వివరించేందుకు నోరు పెగలక పోవడంతో ఓ బంధువు సాయం తీసుకుంది. దీంతో అవాక్కయిన డాక్టర్లు ఆమెకు తొలుత ఎక్స్ రే తీశారు. ఆమె బలంగా ఆవలించడం వల్ల దవడ ఎముక పక్కకు జరిగిందని గుర్తించారు. కొన్ని గంటలపాటు మరికొన్ని పరీక్షల తర్వాత చికిత్స ప్రారంభించారు. ఆమెకు నొప్పి తగ్గడానికి ముందుగా నోటికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు.
చివరకు తల నుంచి దవడ దాకా పెద్ద కట్టు కట్టారు. దీంతో ఆమె దవడ తిరిగి పాత స్థానంలోకి వచ్చింది. తన చికిత్సకు సంబంధించిన వీడియోను ఆమె ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఏకంగా 24 లక్షల వ్యూస్ లభించాయి. ఆమె పరిస్థితిని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పోస్ట్ చేశారు. ఇంత అందమైన అమ్మాయికి ఎంత కష్టం వచ్చిపడిందంటూ ఓ యూజర్ పేర్కొన్నారు. ఆ సమస్య ఎదురైతే ఆమె లాగా ప్రశాంతంగా ఉండేవాడిని కాదంటూ మరొకరు కామెంట్ చేశారు.