Meruga Nagarjuna: జూన్ 4న వైసీపీ చరిత్ర సృష్టించబోతోంది: మంత్రి మేరుగ నాగార్జున
- జగన్ కు రాష్ట్ర ప్రజలు మరోసారి పట్టం కట్టబోతున్నారన్న మేరుగ
- చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారని వ్యాఖ్య
- పోలీసులు టీడీపీకి కొమ్ముకాశారని మండిపాటు
జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు కూడా గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్నాయి. తాజాగా ఏపీ మంత్రి మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడుతూ... జూన్ 4న వైసీపీ సరికొత్త చరిత్రను సృష్టించబోతోందని చెప్పారు. నిజమైన ప్రజా నాయకుడు జగన్ కు ఏపీ ప్రజలు మరోసారి పట్టం కట్టబోతున్నారని అన్నారు. రాష్ట్రంలో రామరాజ్యం రాబోతోందని తెలిపారు. పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగిన ఎన్నికల యుద్ధంలో వైసీపీ మరోసారి అధికారంలోకి రాబోతోందని చెప్పారు. పేదలంతా వైసీపీకే ఓటు వేశారని అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారని మేరుగ చెప్పారు. ఈ కారణంగానే పల్నాడులో వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను పెంచాలని కోరినా ఈసీ పట్టించుకోలేదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీతో కుమ్మక్కై చంద్రబాబు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
పోలీసులు టీడీపీకి కొమ్ముకాశారని మేరుగ విమర్శించారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమాలకు పాల్పడిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైసీపీకి అండగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులకు టీడీపీ ఉసిగొల్పిందని మండిపడ్డారు. సంక్షేమ పథకాల డబ్బులు ప్రజల ఖాతాల్లోకి రాకుండా అడ్డుకున్నది చంద్రబాబేనని చెప్పారు.