KTR: సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్కే అనుకూలం... ఈ స్థానాల్లో గెలుపు ఖాయం: కేటీఆర్
- సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్ పార్టీకే అనుకూలమన్న కేటీఆర్
- వివిధ సర్వేలు కూడా మనకే అనుకూలమని చెప్పాయని వెల్లడి
- కేసీఆర్ బస్సు యాత్ర తర్వాత క్షేత్రస్థాయిలో మార్పు వచ్చిందన్న కేటీఆర్
- మెదక్, నాగర్ కర్నూల్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, కరీంనగర్, ఖమ్మం స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా
లోక్ సభ ఎన్నికల్లో సైలెంట్ ఓటింగ్ జరిగిందని... ఇది తమ పార్టీకే అనుకూలమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం ఆయన ఎంపీ అభ్యర్థులు, వివిధ జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సైలెంట్ ఓటింగ్ వల్ల బీఆర్ఎస్కు అనుకూలమని వివిధ సర్వేలు చెప్పాయని పేర్కొన్నారు.
కేసీఆర్ బస్సు యాత్ర తర్వాత క్షేత్రస్థాయిలో మార్పు వచ్చిందన్నారు. మెదక్, నాగర్ కర్నూల్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, కరీంనగర్, ఖమ్మం స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం నల్గొండలో మాత్రమే గెలిచే అవకాశం ఉందన్నారు. పెద్దపల్లిలో అధికార పార్టీ పెద్ద మొత్తంలో డబ్బులు పంచిందని విమర్శించారు. తాను సిరిసిల్లలో ఐదుసార్లు గెలిచినా పైసా డబ్బు పంచలేదన్నారు.