Pakistan: భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. మన పిల్లలు మురికి కాల్వల్లో పడి చనిపోతున్నారు: పాక్ చట్ట సభ్యుడి ఆవేదన

India landed on Moon but Karachi reports of kid dying in gutter says Pak lawmaker
  • జాతీయ అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేసిన ఎంక్యూఎం-పీ సభ్యుడు సయ్యద్ ముస్తాఫా కమల్
  • ప్రతి మూడు రోజులకు ఒక పిల్లాడు కాల్వలో పడి చనిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయని ఆవేదన
  • దేశానికి రెవెన్యూ ఇంజిన్‌లాంటి కరాచీలో తాగునీరు కూడా లేదన్న కమల్
  • దేశంలో 26.6 మిలియన్ల మంది పిల్లలు స్కూలుకు వెళ్లడం లేదని ఆవేదన
  • ఇలాంటి వారివల్లే దేశ ఆర్థికాభివృద్ధిని ధ్వంసం అవుతోందన్న కమల్
భారత్ వంటి దేశాలు చంద్రుడి మీద ల్యాండ్ అవుతుంటే పాకిస్థాన్‌లో పిల్లలు మాత్రం కాల్వల్లో కిందపడి ప్రాణాలు కోల్పోతున్నారని పాక్ చట్ట సభ్యుడు, ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ పాకిస్థాన్ (ఎంక్యూఎం-పీ) పార్టీ నేత సయ్యద్ ముస్తాఫా కమల్ ఆవేదన వ్యక్తంచేశారు. 

బుధవారం ఆయన జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ ‘‘ప్రపంచం చంద్రుడి మీదకు వెళ్తోంది. మనకిక్కడ కరాచీ పరిస్థితి ఏంటంటే.. చాలామంది పిల్లలు తెరిచివున్న మురికి కాల్వల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అదే సమయంలో ఇండియా చంద్రుడిపై ల్యాండ్ అయిందన్న వార్తలు వస్తున్నాయి. ఆ వెంటనే కరాచీలో ఓ పిల్లాడు నాలాలో పడి మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రతీ మూడో రోజూ ఇలాంటి వార్తలు సర్వసాధారణంగా మారాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

పాకిస్థాన్‌కు కరాచీ ‘రెవెన్యూ ఇంజిన్’ లాంటిదని, దేశంలో రెండు ఓడరేవులు ఉన్నాయని పేర్కొన్న కమల్.. పాకిస్థాన్, సెంట్రల్ ఆసియా, ఆఫ్ఘనిస్థాన్‌కు కరాచీ గేట్‌వే లాంటిదని తెలిపారు. ఇక్కడి నుంచి దాదాపు 68 శాతం ఆదాయాన్ని దేశం మొత్తానికి ఇస్తున్నట్టు వివరించారు. కానీ, 15 ఏళ్లుగా కరాచీకి పరిశుభ్రమైన నీటిని అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే నీరు కూడా చోరీకి గురవుతోందని, ట్యాంకర్ మాఫియా దానిని దోచుకుని కరాచీ ప్రజలకు అమ్ముతోందని వివరించారు. 

పాకిస్థాన్‌లో 26.6 మిలియన్ల మంది పిల్లలు స్కూలుకు వెళ్లడం లేదని తెలిపారు. ఇది 70 దేశాల్లోని జనాభా కంటే ఎక్కువని వాపోయారు. చదువుకోని పిల్లలు దేశ ఆర్థికాభివృద్ధి మొత్తాన్ని నాశనం చేస్తున్నారని కమల్ తెలిపారు.
Pakistan
Syed Mustafa Kamal
India
Karachi

More Telugu News