Helmet In Car: ట్రాఫిక్ పోలీసుల దెబ్బకు కారులో హెల్మెట్ పెట్టుకుని వెళుతున్న యూపీ వాసి.. వీడియో ఇదిగో!

Fined 1000 UP Man Now Drives His Audi With A Helmet On

  • మార్చిలో హెల్మెట్ పెట్టుకోలేదని రూ.1000 ఫైన్ వేసిన ఝాన్సీ పోలీసులు
  • అధికారుల తీరుకు నిరసనగా హెల్మెట్ పెట్టుకున్నాకే కారెక్కుతున్న బహదుర్ సింగ్
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ సిటీ వీధుల్లో ఓ కారు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రోడ్డుమీద ఆ కారు కనిపిస్తే అంతా దానివైపే చూస్తున్నారు. అలాగని అదేమీ ప్రత్యేకమైన కారు కాదు.. కానీ ఆ కారు నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని స్టీరింగ్ తిప్పడమే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గుర్తుతెలియని వ్యక్తి ఒకరు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ వీడియో కాస్తా వైరల్ గా మారింది. ఈ విషయం మీడియాకు చేరడంతో అసలు సంగతేంటో కనుక్కుందామని ఓ మీడియా సంస్థ సదరు కారు ఓనర్ బహదుర్ సింగ్ పరిహార్ ను సంప్రదించింది. మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ట్రాఫిక్ పోలీసుల దెబ్బకు భయపడి హెల్మెట్ పెట్టుకుని కారు డ్రైవ్ చేస్తున్నానని బహదుర్ చెప్పుకొచ్చారు. 

అసలేం జరిగిందంటే..
గత మార్చి నెలలో ఓ రోజు బహదుర్ సింగ్ సెల్ ఫోన్ కు ట్రాఫిక్ చలానా మెసేజ్ వచ్చింది. హెల్మెట్ పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నందుకు రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నట్లు అందులో ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. దీంతో తాను టూవీలర్ ఎప్పుడు నడిపానా అని బహదుర్ ఆశ్చర్యపోయాడు. ఇదేదో పొరపాటున వచ్చిన మెసేజ్ కావొచ్చనే ఉద్దేశంతో యూపీ ట్రాఫిక్ పోలీసుల వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేశాడు. అందులో కూడా తన ఆడి కారు నెంబర్ తోనే చలానా ఇష్యూ అవడం, చలానాలో స్పష్టంగా మోటార్ కార్ అని మెన్షన్ చేయడం చూసి అవాక్కయ్యాడు. కారులో హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేశానని తనకు ఫైన్ విధించడంతో ట్రాఫిక్ పోలీసులపై బహదుర్ తీవ్రంగా మండిపడ్డాడు. వాళ్ల నిర్వాకం పదిమందికీ తెలియాలని, తనకు ఫైన్ వేయడంపై నిరసన తెలిపేందుకు ఈ పద్ధతిని ఎంచుకున్నట్లు మీడియాకు వివరించాడు. ఆపై హెల్మెట్ సరిచేసుకుని కారెక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

  • Loading...

More Telugu News