Andhra Pradesh: జగనన్న విద్యా దీవెన, ఆసరా నిధుల విడుదల
- డీబీటీ నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్
- ఒక్కరోజే ఆసరాకు రూ.1480 కోట్లు
- జగనన్న విద్యా దీవెనకు రూ.502 కోట్ల నిధులు విడుదల
డీబీటీ పథకాల నిధుల విడుదలకు ఎన్నికల సంఘం (ఈసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నిన్న (బుధవారం) ఒక్కరోజే ఆసరాకు రూ. 1480 కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద రూ. 502 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయవచ్చని ఈసీ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు పథకాల లబ్ధిదారులకు నిధులు మంజూరు చేశారు. మిగిలిన పథకాలకు కూడా నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. కాగా, గతంలో టీడీపీ ఫిర్యాదులతో పోలింగ్‌కు ముందు డీబీటీ కింద నిధుల విడుదలను సీఈఓ ముఖేష్ కుమార్ మీనా నిలిపివేశారు.
ఈ నేపథ్యంలో మే 13న పోలింగ్ ముగిసిన తరువాత నిధుల విడుదలకు ఈసీ ఆమోదించింది. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఈసీ ఆదేశాల మేరకు మే 15న ఆసరా, జగనన్న విద్యా దీవెన కింద రూ. 1982 కోట్ల రూపాయలు నగదు లబ్ధిదారుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేసింది. మిగిలిన పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు కూడా రెండు, మూడు రోజుల్లో డీబీటీ విధానం ద్వారా నిధులు విడుదల చేస్తామని సీఎస్ తెలిపారు. దీంతో విద్యార్థులు, మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.