Janga Krishnamurthy: ఏపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు
- 1999, 2009లో కాంగ్రెస్ తరపున గురజాల ఎమ్మెల్యేగా గెలిచిన జంగా
- 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓటమిపాలైన వైనం
- జంగాను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ చేసిన వైసీపీ
ఏపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడింది. ఆయనపై వేటు వేస్తూ శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఆధారంగా ఆయన అనర్హత వేటు వేశారు. వైసీపీ తరపున గెలిచిన జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరారు. దీంతో, ఆయనపై శాసనమండలి ఛైర్మన్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం విచారణ జరిపి, కృష్ణమూర్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. ఈ క్రమంలో విచారణ జరిపిన మండలి ఛైర్మన్... చివరకు కృష్ణమూర్తిపై వేటు వేశారు.
1999, 2009లో పల్నాడు జిల్లా గురజాల కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కృష్ణమూర్తి గెలిచారు. అనంతరం వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. వైసీపీలో ఉన్న సమయంలో విప్ గా కూడా పని చేశారు. ఎన్నికల ముందు ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీని వీడక ముందే ఆయనను విప్ పదవి నుంచి తొలగించడం గమనార్హం.