Royal Challengers Bengaluru: ఆర్సీబీకి బ్యాడ్ న్యూస్.. 18న చెన్నైతో మ్యాచ్ కు వాన గండం!
- వాతావరణ వెబ్ సైట్ ఆక్యువెదర్ అంచనా
- 17వ తేదీ నుంచి 5 రోజులపాటు బెంగళూరులో వర్షాలు కురవొచ్చని వెల్లడి
- ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్.. ఆర్సీబీ ఇంటికే
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి వాన గండం ముప్పు పొంచి ఉంది. ! ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ రద్దయ్యే పరిస్థితి కనిపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్ కే)తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శనివారం మ్యాచ్ జరగాల్సి ఉండగా ఆ రోజు నుంచి 5 రోజులపాటు నగరానికి వర్ష సూచన ఉన్నట్లు ఓ ప్రైవేటు వాతావరణ వెబ్ సైట్ బ్యాడ్ న్యూస్ చెప్పింది.
ఆక్యువెదర్ వెబ్ సైట్ అంచనాల ప్రకారం శనివారం చిన్నస్వామి స్టేడియంపై 99 శాతం మబ్బులు పరుచుకొనే అవకాశం ఉంది. మధ్యాహ్న సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురవచ్చని వెబ్ సైట్ తెలిపింది. అలాగే సాయంత్రం వేళ వర్షం కురిసే అవకాశం 74 శాతం మేర ఉందని అంచనా వేసింది. ఇక రాత్రికి 100 శాతం మబ్బులు వ్యాపించి ఉంటాయని.. 62 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభించనుంది. దీంతో ఇప్పటికే 14 పాయింట్లు సాధించిన చెన్నై జట్టు మొత్తం 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించనుంది. కానీ ఆర్సీబీ మాత్రం 13 పాయింట్లకే పరిమితమై ఇంటి ముఖం పట్టాల్సి రానుంది.
మరోవైపు మ్యాచ్ సమయం మధ్యలో వర్షం ఆగితే చెరో ఐదు ఓవర్ల ఆట సాధ్యమయ్యే అవకాశం ఉంది. అది కూడా రాత్రి 10:56 గంటల్లోగా మ్యాచ్ మొదలయ్యే అవకాశం ఉంటేనే సాధ్యమవుతుంది. ఇప్పటికే కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ బెర్తులు ఖాయం చేసుకోగా మిగిలి ఉన్న మరో రెండు బెర్తుల కోసం ఆర్సీబీ, సీఎస్ కేతోపాటు ఎస్ ఆర్ హెచ్, డీసీ, ఎల్ ఎస్ జీ జట్లు పోటీపడుతున్నాయి. అయితే ఇప్పటికే 14 పాయింట్లు సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు మరో రెండు మ్యాచ్ లు ఉండటంతో ఆ జట్టు ఒక్క మ్యాచ్ లో గెలిచినా ప్లే ఆఫ్స్ కు చేరుకోనుంది.