AP CS: ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎస్, డీజీపీ.. కాసేపట్లో ఈసీ ముందుకు!
- ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం
- హింసను అరికట్టడంలో సీఎస్, డీజీపీ విఫలమయ్యారన్న ఈసీ
- ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని సమన్ల జారీ
ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపట్లో అశోకా రోడ్డులోని ఏపీ భవన్ కు వారు చేరుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈసీ కార్యాలయానికి వెళ్లనున్నారు. పోలింగ్ రోజున, ఆ తర్వాత ఏపీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీకి వివరణ ఇవ్వనున్నారు.
ఎన్నికల తర్వాత పల్నాడు, తిరుపతి, తాడిపత్రి సహా పలు చోట్లు జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. హింసను ఎందుకు కట్టడి చేయలేకపోయారని ప్రశ్నించింది. హింసను అరికట్టడంలో సీఎస్, డీజీపీలు విఫలమయ్యారని మండిపడింది. తమ ముందు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఇద్దరికీ సమన్లు జారీ చేసింది. హింసను నియంత్రించడంలో విఫలం కావడానికి కారణాలు, దాడులను ముందుగా ఊహించలేకపోవడానికి కారకులు ఎవరనేది వివరించాలని సమన్లలో స్పష్టం చేసింది. హింసకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని పేర్కొంది. ఏపీ పరిస్థితులపై చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రత్యేక దృష్టిని సారించారని తెలిపింది.