COVAXIN: కొవాగ్జిన్ టీకాతోనూ దారుణమైన దుష్ప్రభావాలు!
- బెనారస్ హిందూ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
- కౌమారదశలో ఉన్న మహిళలకు ఏఈఎస్ఐ ముప్పు
- వెంటాడే శ్వాసకోస సమస్యలు
ఆస్ట్రాజెనెకా తయారీ కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో త్రోంబోసిస్ వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయంటూ ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించి అందరినీ షాక్‌కు గురిచేసింది. తాజాగా, భారత తయారీ కొవాగ్జిన్ టీకా కూడా అంత సురక్షితం కాదని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. అలెర్జీ వంటి సమస్యలతో బాధపడుతున్న కౌమార దశలో ఉన్న మహిళలపై ఈ టీకా తీవ్ర దుష్పరిణామాలు చూపిస్తోందని, వారికి అడ్వెర్స్ ఈవెంట్స్ ఆఫ్ స్పెషల్ ఇంటెరెస్ట్ (ఏఈఎస్ఐ) ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.
బనారస్ హిందూ యూనివర్సిటీ నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలు ‘స్ప్రింగర్ లింగ్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అధ్యయనంలో భాగంగా కౌమారదశలో ఉన్న 635 మంది, 291 మంది పెద్దలు సహా మొత్తం 1,024 మందిపై అధ్యయనం నిర్వహించారు. ఏడాది పాటు వీరిపై నిర్వహించిన అధ్యయనంలో పలు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. కౌమారదశలో ఉన్న వారిలో 47.9 శాతం మంది, 42.6 శాతం మంది పెద్దలు వైరల్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (శ్వాసకోశ సమస్య)కు గురైనట్టు తేలింది.
ఏఈఎస్ఐ అంటే?
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. ఏఈఎస్ఐ అనేది ప్రత్యేకమైన ప్రతికూల ఘటనల సమాహారం. టీకాల కారణంగా ఇది సంభవించే అవకాశం ఉంది. కొంతమందికి రోగనిరోధకత తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంది. అనాలిలాక్సిస్, మయోకార్డిటిస్, త్రోంబోసిస్ (రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్లు పడిపోవడం) వంటివి ఏఈఎస్ఐకి కొన్ని ఉదాహరణలు.
ఇందులోనే కొన్ని కేసుల్లో స్ట్రోక్, గులియన్-బారే సిండ్రోమ్ వంటివి కూడా స్వల్పంగా కనిపిస్తాయి. ఏఈఎస్ఐ బారినపడిన మహిళల్లో రుతుక్రమం, మస్కులోస్కెలటల్ వంటివాటి గతితప్పడం కనిపిస్తాయి. కాబట్టి కొవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న మహిళల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని కోరారు.