Single Screen Theatres: తెలంగాణలో థియేటర్ల మూసివేతపై ప్రకటన చేసిన ఫిలిం చాంబర్
- వేసవిలో విడుదల కాని పెద్ద హీరోల సినిమాలు
- పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల భారం
- 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేతకు నిర్ణయం
- దీంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్న తెలంగాణ ఫిలిం చాంబర్
వేసవి సీజన్ లో పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం, ఎన్నికల సీజన్... ఇలాంటి కారణాలతో తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రాబడి తగ్గింది. మరోవైపు, ఐపీఎల్ కూడా కుమ్మేస్తుండడంతో సినిమా హాళ్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య తగ్గింది. ఈ నేపథ్యంలో, నిర్వహణ ఖర్చులు భరించలేక... తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లను 10 రోజుల పాటు మూసివేయనున్నారు.
దీనిపై తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేయాలన్నది ఎగ్జిబిటర్ల వ్యక్తిగత నిర్ణయం అని, ఈ నిర్ణయం తీసుకునే ముందు ఎగ్జిబిటర్స్ తమను సంప్రదించలేదని ఫిలిం చాంబర్ స్పష్టం చేసింది.
సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేత నిర్ణయంతో ఫిలిం చాంబర్ కు ఎలాంటి సంబంధం లేదని ఉద్ఘాటించింది. ఇది పూర్తిగా సినిమా థియేటర్ యజమానులు స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయం అని తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.