Sandeep Lamichhane: అత్యాచారం కేసులో నేపాల్ స్టార్ క్రికెట‌ర్‌ను నిర్దోషిగా తేల్చిన హైకోర్టు.. 2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాల్గొనే ఛాన్స్‌!

Nepal star cricketer Sandeep Lamichhane Declared innocent by Patan High Court

  • నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచ్చెన్‌ను నిర్దోషిగా తేల్చిన ప‌ఠాన్‌ హైకోర్టు
  • ఓ హోటల్‌లో సందీప్‌ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ కేసు వేసిన‌ 17 ఏళ్ల మైన‌ర్ 
  • దీంతో అత‌డికి ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన జిల్లా కోర్టు   
  • ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన స్టార్ క్రికెట‌ర్‌ 

అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచ్చెన్‌ను ప‌ఠాన్‌ హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. జిల్లా కోర్టు ఇచ్చిన ఎనిమిదేళ్ల జైలు శిక్ష తీర్పును హైకోర్టు తోసిపుచ్చింది. బుధవారం ఈ మేరకు తీర్పును వెల్ల‌డించింది. 2022లో కాఠ్ మాండూలోని ఓ హోటల్ లో సందీప్‌ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ 17 ఏళ్ల‌ ఓ మైనర్‌ కోర్టును ఆశ్రయించింది.

దీనిపై విచారణ చేపట్టిన నేపాల్ జిల్లా కోర్టు ఈ ఏడాది జనవరిలో అతడ్ని దోషిగా తేల్చింది. అత‌నికి ఎనిమిదేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ సందీప్ లామిచ్చెన్‌ హైకోర్టును ఆశ్రయించాడు. తాజాగా విచారణ చేపట్టిన జస్టిస్ సూర్య దర్శన్, జస్టిస్ దేవ్ భట్టా డివిజన్ బెంచ్, గతంలో జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. ఈ కేసులో అతడ్ని నిర్దోషిగా తేల్చింది.

సందీప్ లామిచ్చెన్‌పై ఉన్న‌ కేసు ఇదే..! 
2022 ఆగస్టు 21న కాఠ్ మాండూ, భక్తపూర్లో తనను పలు ప్రాంతాల్లో తిప్పి అదే రోజు రాత్రి కాఠ్ మాండు సినమంగల్ లోని ఓ హోటల్ కు తీసుకొచ్చి అత్యాచారం చేసినట్లు నేపాల్ కు చెందిన ఓ 17 ఏళ్ల మైనర్ఆ బాలిక ఆరోపించింది. అతడిపై అక్కడి స్థానిక‌ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. 

అటు నేపాల్ కోర్టు కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో నేపాల్ క్రికెట్ బోర్డు సందీప్ లామిచ్చెన్ పై వేటు వేసింది. ఇక గతేడాది కరేబియన్ ప్రీమియర్ లీగ్ ముగించుకుని స్వ‌దేశానికి తిరిగి వచ్చిన అతడ్ని పోలీసులు విమానాశ్ర‌యంలోనే అరెస్టు చేశారు. ఈ క్ర‌మంలో 2022 నవంబర్ లో అతడిని జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. ఈ క్ర‌మంలో హైకోర్టుకు వెళ్లి సందీప్ లామిచ్చెన్‌ బెయిల్ తెచ్చుకున్నాడు.

ఇక‌ జూన్ లో ప్రారంభంకానున్న 2024 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు సందీప్ అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. అయితే నేపాల్ ఇప్పటికే 15 మందితో కూడిన జట్టును పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ కోసం ప్రకటించింది. కాగా, ఐసీసీ నిబంధనల ప్రకారం జట్టులో మార్పులు చేసుకునేందుకు ఈ నెల 25వ తేదీ వ‌రకు అవకాశం ఉంది. దీంతో సందీప్ లామిచ్చెన్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ జట్టులో చోటు దక్కించుకునే అవ‌కాశం ఉంది.

  • Loading...

More Telugu News