NVSS Prabhakar: అప్పుడు రేవంత్ రెడ్డిని కేసీఆర్ కాపాడారు... ఇప్పుడు కేసీఆర్‌ను సీఎం కాపాడుతున్నారు: బీజేపీ నేత ప్రభాకర్
- ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని కేసీఆర్ కాపాడారన్న ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను ఇప్పుడు రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని విమర్శ
- రైతుల విషయంలో సీఎం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం
- రుణమాఫీకి కార్పోరేషన్ ఏర్పాటు చేసి అప్పులు చేసే ప్రయత్నమని ఆరోపణ
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని కేసీఆర్ కాపాడారని... అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు కేసీఆర్‌ను ముఖ్యమంత్రి కాపాడుతున్నారని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. బీజేపీ గెలుపును అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య బంధం ఎన్నికల్లో బయటపడిందన్నారు.
రైతుల విషయంలో ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మొక్కుబడిగా చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత పట్టించుకోలేదన్నారు. అనేక మండలాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభించలేదన్నారు. వరికి రూ.500 బోనస్‌పై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడటం లేదన్నారు. గతంలో కేసీఆర్ రుణమాఫీ చేస్తానని పదేళ్ల పాటు నాన్చారని... ఇప్పటికీ రుణమాఫీ కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.
రైతులకు రుణమాఫీ చేసేందుకు కొత్తగా కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చెబుతోందని... ఆ పేరుతో అప్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్ఎంబీకి మించి రుణాలు తీసుకుందన్నారు. రుణమాఫీ ఎలా చేస్తారో స్పష్టత ఇవ్వలేక పోతున్నారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ భీమా నిధులు కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. తెలంగాణలో వ్యవసాయం సంక్షోభం దిశగా అడుగులు వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగ సమస్యలు, వ్యవసాయ సంక్షోభంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్‌ను రేవంత్ రెడ్డి నీరుగారుస్తున్నారని మండిపడ్డారు.