AP Violence: పల్నాడు, ఇతర జిల్లాల్లో పోలింగ్ అనంతర హింసాత్మక ఘటనలపై హైకోర్టు కీలక ఆదేశాలు
- ఏపీలో పోలింగ్ ముగిసినా రగులుతూనే ఉన్న అల్లర్లు
- పల్నాడు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో హింస
- దాడులను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారన్న పిటిషనర్
- సీఎస్, డీజీపీ, సీఈవోకు ఆదేశాలు ఇచ్చిన ఏపీ హైకోర్టు
ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా అనేక అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత రోజు అంతకంటే ఎక్కువగా హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో, పల్నాడుతో పాటు పలు జిల్లాల్లో జరిగిన అల్లర్ల విషయమై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
విచారణ సందర్భంగా... ఎన్నికల తర్వాత కూడా హింసాత్మక ఘటనలు ఆగడంలేదంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దాడులను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. అల్లర్లు, దాడులు జరగకుండా కట్టడి చేయాలని సీఎస్ ను, డీజీపీని ఆదేశించాలని కోరారు.
ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ... పల్నాడు జిల్లాలో ఇప్పటికే 144 సెక్షన్ అమల్లోకి తీసుకువచ్చినట్టు చెప్పారు.
వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం... గొడవలు అరికట్టాలంటూ సీఎస్, డీజీపీ, సీఈవోకు, జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైతే అల్లర్లు జరిగాయో, ఎక్కడైతే అల్లర్లు జరిగేందుకు అవకాశం ఉందో అక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.