Rains: ముంబైలో 100 అడుగుల హోర్డింగ్ కూలిన ఘటన: కారులో భార్యాభర్తల మృతదేహాల గుర్తింపు
- బిల్ బోర్డు శిథిలాలు తొలగిస్తుండగా కారులో మృతదేహాల గుర్తింపు
- రెండు నెలల క్రితం రిటైర్ అయిన చన్సోరియా
- వీసా నిమిత్తం ముంబైకి వచ్చిన చన్సోరియా, భార్య అనిత
- బంక్లో పెట్రోల్ పోసుకోవడానికి కారు ఆపిన సమయంలో కూలిన బిల్ బోర్డు
ఇటీవల భారీ వర్షాల కారణంగా ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో 100 అడుగుల హోర్డింగ్ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. బిల్ బోర్డు శిథిలాలు తొలగిస్తుండగా కారులో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. మృతులను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రిటైర్డ్ మేనేజర్ మనోజ్ చన్సోరియా, ఆయన భార్య అనితగా గుర్తించారు.
సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పెట్రోల్ బంక్ పక్కన ఉన్న ఈ బిల్ బోర్డు కూలిపోవడంతోనే 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో బుధవారం రాత్రి కారులో వీరి మృతదేహాలను గుర్తించారు. మనోజ్ చన్సోరియా రెండు నెలల క్రితమే పదవీ విరమణ చేశారు.
తర్వాత వారు ముంబైని వీడి జబల్పూర్కు వెళ్లారు. వీసా నిమిత్తం కొన్నిరోజుల క్రితం వారు ఇక్కడకు వచ్చినట్లు బంధువులు తెలిపారు. పని పూర్తి చేసుకొని తిరిగి జబల్పూర్ వెళుతున్నారు. ఈ క్రమంలో పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకునేందుకు బంక్ వద్ద కారు ఆపారు. ఇదే సమయంలో బిల్ బోర్డు కూలి వారు మృత్యువు ఒడిలోకి చేరారు.