Kerala: బాలిక వేలుకి చేయాల్సిన సర్జరీని నాలుకకు చేసిన వైద్యుడు

A doctor performed surgery on a childs tongue instead of her finger in Kerala

  • కేరళలో ఓ వైద్యుడి నిర్వాకం
  • ఆరో వేలు తొలగించుకునేందుకు హాస్పిటల్‌లో చేరిన బాలిక 
  • విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురైన తల్లిదండ్రులు
  • నివేదికను పరిశీలించి బాధ్యుడైన వైద్యుడిని తొలగించిన రాష్ట్ర వైద్యశాఖ మంత్రి

కేరళలోని కోజికోడ్ మెడికల్ కాలేజీలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ డాక్టర్ చిన్నారి వేలికి చేయాల్సిన సర్జరీని నాలుకకు చేశాడు. ఆరో వేలు తొలగించుకునేందుకు హాస్పిటల్‌లో బాలిక అడ్మిట్ అయింది. అయితే ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి బయటకు వచ్చిన బాలిక నాలుకకు ఆపరేషన్‌ జరిగిందని గుర్తించిన కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇదేం నిర్వాకమని వైద్యుడిని తల్లిదండ్రులు ప్రశ్నించగా నోటిలో తిత్తి (ద్రవకోశం) ఉందని, అందుకే నాలుకకు శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్‌ చెప్పాడని తల్లిదండ్రులు మండిపడ్డారు. బాలిక నోటిలో ఎలాంటి సమస్యా లేదని ఖండించారు. వైద్యుడి నిర్లక్ష్యాన్ని అవమానకరంగా భావిస్తున్నామని ధ్వజమెత్తారు.

కాగా ఇద్దరు పిల్లలకు ఒకే రోజు శస్త్ర చికిత్సలు జరగాల్సి ఉండడంతో ఈ పొరపాటు జరిగిందని ఆసుపత్రి అధికారులు తమకు చెప్పారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటన కేరళలో తీవ్ర దుమారం రేపింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి అందిన నివేదికను పరిశీలించి మంత్రి వీణా జార్జ్ రంగంలోకి దిగారు. బాధ్యుడైన డాక్టర్ బిజోన్ జాన్సన్‌ను సస్పెండ్ చేశారు. శస్త్రచికిత్సలు, ఇతర వైద్య ప్రక్రియలకు సంబంధించిన ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వైద్యుడిపై పోలీసు కేసు నమోదు చేశారు. ఐపీసీ 336 (ఇతరుల జీవితానికి లేదా వ్యక్తిగత భద్రతకు హాని), 337 (ఇతరుల జీవితానికి లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగిస్తూ గాయపరిచినందుకు) సెక్షన్లను చేర్చారు. కాగా ఈ ఘటనపై కేరళలో విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.

  • Loading...

More Telugu News