Nepal Ban: ఎమ్‌డీహెచ్, ఎవరెస్ట్ మసాలాలపై మరో దేశం నిషేధం!
- ఎవరెస్ట్, ఎమ్‌డీహెచ్ బ్రాండ్స్ మసాలాల్లో నిషేధిత ఇథిలీన్ ఆక్సైడ్ అవశేషాలను గుర్తించిన నేపాల్
- వీటి దిగుమతి, మార్కెటింగ్‌పై నిషేధం విధించిన ఆహార నియంత్రణ సంస్థ
- పూర్తి స్థాయి నివేదిక వచ్చే వరకూ నిషేధం అమల్లో ఉంటుందని వెల్లడి
- న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికాల్లోనూ ఎవరెస్టు, ఎమ్డీహెచ్పై నిఘా
పాప్యులర్ భారతీయ బ్రాండ్లు ఎవరెస్టు, ఎమ్‌డీఎహ్ మసాలా ఉత్పత్తులపై తాజాగా మరో దేశం నిషేధం విధించింది. ఈ ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారక ఇథిలీన్ ఆక్సైడ్ క్రిమిసంహారకాన్ని గుర్తించిన నేపాల్ వీటిపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే సింగపూర్, హాంకాంగ్‌లు ఈ మసాలా బ్రాండ్‌పై నిషేధం విధించాయి. దీంతో, తమ దేశంలోకి దిగుమతి అవుతున్న ఉత్పత్తులపై నేపాల్‌కు చెందిన ఆహార నియంత్రణ సంస్థ పరీక్షలు ప్రారంభించింది. ఈ అధ్యయనంలో అధికారులు ఇథిలీన్ ఆక్సైడ్ అవశేషాలను గుర్తించారు. పూర్తి స్థాయి నివేదిక వచ్చే వరకూ నిషేధం కొనసాగుతుందని నేపాల్ అధికారులు పేర్కొన్నారు. ఈ బ్రాండ్ల దిగుమతులు, అమ్మకాలపై నిషేధం విధించినట్టు చెప్పారు.
భారతీయులకు చిరపరిచితమైన ఎవరెస్టు, ఎండీహెచ్ మసాలాలు విదేశాలకూ ఎగుమతి అవుతుంటాయి. అయితే, వీటిల్లో ఇథిలీన్ ఆక్సైడ్ (ఈటీఓ) ఉన్నట్టు హాంకాంగ్, సింగపూర్లు తొలిసారిగా గుర్తించాయి. ఆహార ఉత్పత్తుల స్టెరిలైజేషన్‌కు ఈ రసాయనాన్ని వినియోగించేవారు. ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల్లో.. సాల్మొనెల్లా అనే హానికారక బ్యాక్టీరియాతో కలుషితం కాకుండా ఉండేందుకు ఈటీఓను వాడేవారు. దీంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని గుర్తించిన అనేక దేశాలు ఈ రసాయనం వాడకంపై నిషేధం విధించాయి.
మరోవైపు, న్యూజిలాండ్, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా కూడా ఈ బ్రాండ్స్‌పై దృష్టిసారించాయి. ఈ విషయమై గురువారం బ్రిటన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారత్ నుంచి దిగుమతి చేసుకునే మసాలాల్లో నిషేధిత క్రిమిసంహారకాలు ఉన్నాయో లేదో తేల్చేందుకు గతేడాది నుంచీ పటిష్ఠ చర్యలు ప్రారంభించామని పేర్కొంది.