IPL 2024: ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే సీఎస్కేపై ఎన్ని పరుగుల తేడాతో గెలవాలంటే..!
- శనివారం రాత్రి చెన్నై, బెంగళూరు జట్ల మధ్య కీలక పోరు
- చెన్నైపై 18 పరుగుల తేడాతో గెలిస్తే ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ బెర్త్
- ఆర్సీబీ లక్ష్య ఛేదన చేస్తే 18.1 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించాలి
- ఉత్కంఠ రేపుతున్న నాలుగవ ప్లే ఆఫ్స్ స్థానం
ఐపీఎల్ 2024 లీగ్ దశ ముగింపు దశకు వచ్చేసింది. రెండు మూడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలివున్నాయి. అయినప్పటికీ మరో ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు కావాల్సివుంది. ఇప్పటికే టాప్-3 స్థానాల్లో వరుసగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు నిలవగా... చిట్టచివరి స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య పోటీ నెలకొంది. శనివారం రాత్రి సీఎస్కే, ఆర్సీబీ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌తో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించనున్న జట్టు ఏదో తేలిపోనుంది.
బెంగళూరు గెలుపు ఇలా ఉండాలి..
ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 14 పాయింట్లు, +0.528 నెట్ రన్ రేట్‌తో ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లు, +0.387 నెట్ రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. దీంతో చెన్నైపై గెలిచిన సమీకరణంలో మాత్రమే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరుకోగలదు. అయితే ఆ గెలుపు కూడా అవసరమైన నెట్ రన్ రేట్‌కు తగ్గట్టు కావాల్సినన్ని పరుగుల తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది.
ఒకవేళ ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసి చెన్నైకి 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే డుప్లెసిస్ సేన కనీసం 18 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. అదే ఆర్సీబీ లక్ష్య ఛేదనకు దిగితే మాత్రం 18.1 ఓవర్లలోనే టార్గెట్‌ను ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఈ సమీకరణాలతో గెలిస్తే మాత్రమే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరుకోగలదు. లేదంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచినా మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా చెన్నై సూపర్ కింగ్సే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. ఈ కారణంగానే సీఎస్కేకి మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా ఆర్సీబీపై చెన్నై విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. ఆర్‌సీబీ చేతిలో ఓడినా మెరుగైన నెట్ రన్ రేట్‌తో అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ఒకవేళ రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో ఓడిపోయి.. ఆర్సీబీపై చెన్నై విజయం సాధిస్తే మెరుగైన నెట్ రన్‌రేట్‌తో టాప్-2 స్థానాన్ని కూడా దక్కించుకునే అవకాశాలు చెన్నైకి ఉన్నాయి.