Baby Elephant: బేబీ ఎలిఫెంట్ కు ‘జెడ్ క్లాస్’ భద్రత! వీడియో ఇదిగో
- తమిళనాడులోని అడవిలో తల్లి ఏనుగు, సోదర ఏనుగుల నిద్ర వీడియో వైరల్
- అన్నామలై టైగర్ రిజర్వ్ లో కనిపించిన అరుదైన దృశ్యం
- ఓ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ తీసిన వీడియోను నెటిజన్లతో పంచుకున్న ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు
మీరెప్పుడైనా అడవిలో ఏనుగులు నిద్రించడం చూశారా? పరుపు లాంటి మెత్తటి పచ్చికపై గజరాజులు పట్టపగలు ఆదమరచి పడుకోవడం వీక్షించారా? కానీ ఈ అరుదైన దృశ్యం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
తమిళనాడులోని అన్నామలై టైగర్ రిజర్వ్ లో ఓ ఏనుగుల కుటుంబం నిద్రిస్తున్న 15 సెకన్ల వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఓ తల్లి ఏనుగు, రెండు సోదర ఏనుగుల మధ్య ఓ బేబీ ఎలిఫెంట్ ముడుచుకొని పడుకుంది. మరో ఏనుగు మాత్రం నిలబడి పహారా కాస్తున్నట్లు కనిపించింది.
ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ధను పరణ్ ఈ అందమైన దృశ్యాన్ని తన డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించారు. సోషల్ మీడియాలో తరచూ అడవి జంతువుల వీడియోలను షేర్ చేసే ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ఈ వీడియోను తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.
‘తమిళనాడులోని అన్నామలై టైగర్ రిజర్వ్ లోని దట్టమైన అడవిలో ఒక అందమైన ఏనుగుల కుటుంబం నిద్రిస్తోంది. బుజ్జి ఏనుగుకు కుటుంబం ఎలా ‘జెడ్ క్లాస్’ భద్రత కల్పిస్తోందో చూడండి. కుటుంబ సభ్యులు నిద్రిస్తుంటే మరో గున్న ఏనుగు ఎలా పహారా కాస్తోందో గమనించండి. మన ఇళ్లలో కనిపించే దృశ్యం లాగానే ఉంది కదూ?’ అంటూ ఆమె ఈ వీడియో కింద కామెంట్ పోస్ట్ చేశారు.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఏనుగుల కుటుంబ బంధాన్ని చూసి ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు. ‘ఇలాంటి అందమైన, అరుదైన దృశ్యాలను చూడటం అద్భుతం’ అని ఓ యూజర్ పోస్ట్ చేశారు. మరొకరేమో కచ్చితంగా భద్రపరుచుకోవాల్సిన వీడియో ఇదంటూ కామెంట్ పెట్టారు. ఇంకొకరేమో ఈ తరం పిల్లలకు వన్యమృగాలపై అవగాహన కల్పించేందుకు దీన్ని డెస్క్ టాప్ వాల్ పేపర్ గా పెట్టుకోవచ్చని అభిప్రాయపడ్డారు.