United Nations: భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను సవరించిన ఐక్యరాజ్య సమితి
- 2024లో భారత్ 6.9 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేసిన ఐరాస
- ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేటు వినియోగం తోడ్పాటునిస్తాయని విశ్లేషణ
- 2024 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితిపై నివేదిక విడుదల చేసిన ఐరాస
ప్రస్తుత ఏడాది 2024లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాలను ఐక్యరాజ్య సమితి సవరించింది. ఈ ఏడాది జనవరిలో 6.2 శాతంగా అంచనా వేసిన జీడీపీ వృద్ధి రేటుని 6.9 శాతానికి పెంచింది. 2024లో దాదాపు 7 శాతం వృద్ధిని అందుకోనుందని, ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవనుందని ఐరాస విశ్లేషించింది.
ప్రభుత్వ పెట్టుబడులు, స్థిరమైన ప్రైవేట్ వినియోగం ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నాయని అంచనా వేసింది. బయట దేశాల నుంచి డిమాండ్ తక్కువగా ఉండడంతో ఎగుమతి వృద్ధిపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నప్పటికీ ఫార్మాస్యూటికల్స్, రసాయనాల ఎగుమతులు దృఢంగా పుంజుకోవచ్చునని రిపోర్ట్ అంచనా వేసింది. 2024 మధ్య నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి, అవకాశాలకు సంబంధించిన డేటాను ఐరాస గురువారం విడుదల చేసింది.
భారత ఆర్థిక వ్యవస్థ 2024లో 6.9 శాతం, మరుసటి ఏడాది 2025లో 6.6 శాతం వృద్ధిని సాధిస్తుందని ఐరాస నివేదిక అంచనా వేయబడింది. కాగా జనవరిలో ఐరాస వరల్డ్ ఎకనామిక్ సిట్యుయేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్-2024 నివేదిక ఈ ఏడాది భారత్ 6.2 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేసిన విషయం తెలిసిందే. దేశీయంగా దృఢమైన డిమాండ్, తయారీ, సేవల రంగాలలో చక్కటి వృద్ధి నమోదవుతుందని విశ్లేషించింది.