YS Sharmila: షర్మిలకు కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు
- ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా వివేకా హత్య గురించి మాట్లాడిన షర్మిల
- వివేకా హత్య గురించి మాట్లాడకుండా ఆదేశాలు జారీ చేసిన కడప కోర్టు
- వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా కడప కోర్టు ఉత్తర్వులు ఉన్నాయన్న సుప్రీంకోర్టు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి మాట్లాడొద్దంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిలను కడప కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసును షర్మిల ప్రధానంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాశ్ కు జగన్ మళ్లీ టికెట్ ఇచ్చారంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు నేరస్తులకు, ధర్మం వైపు నిలబడ్డ వారికి మధ్య జరుగుతున్నాయని అన్నారు.
ఈ నేపథ్యంలో, వివేకా హత్య కేసు గురించి మాట్లాడకుండా షర్మిలకు ఆదేశాలు జారీ చేయాలంటూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు కడప కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కడప కోర్టు... వివేకా హత్య కేసు గురించి మాట్లాడొద్దని ఏప్రిల్ 16న ఆదేశాలు జారీ చేసింది.
కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై షర్మిల హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్ ను కొట్టేసింది. దీంతో ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కడప కోర్టు ఆదేశాలు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉన్నాయని... వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా కడప కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రతివాదుల వాదనలను కూడా వినకుండా ఏకపక్షంగా ఆదేశాలను జారీ చేశారని తెలిపింది. కడప కోర్టు ఆదేశాలపై స్టే విధిస్తున్నామని... తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాత చేపడతామని చెప్పింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.