FDI: ఎఫ్ డీఐలు చైనాకు తగ్గాయి... భారత్ కు పెరిగాయి: ఐరాస నివేదికలో ఆసక్తికర అంశాలు
- పాశ్చాత్య సంస్థల పెట్టుబడులకు గమ్యస్థానంగా భారత్
- చైనాకు చాలా వరకు విదేశీ పెట్టుబడులు తగ్గాయన్న ఐరాస
- భారత్ వృద్ధిరేటు 6.9 శాతం అని వెల్లడి
- చైనా వృద్ధిరేటు 4.8 శాతం అని వివరణ
ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అంచనాలు-2024 పేరిట ఐక్యరాజ్యసమితి రూపొందించిన తాజా నివేదికలో ఆసక్తికర అంశాలు పొందుపరిచారు. గత కొంతకాలంగా చైనాకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డీఐలు) తగ్గాయని, అదే సమయంలో భారత్ కు ఎఫ్ డీఐలు పెరిగాయని ఐరాస నివేదిక వెల్లడించింది.
అనేక బహుళ జాతి సంస్థల పెట్టుబడులకు ఇప్పుడు భారత్ గమ్యస్థానంగా మారిందని, చైనాతో పోల్చితే భారత్ అధికంగా ఎఫ్ డీఐల ద్వారా లబ్ధి పొందుతోందని ఐరాస ఆర్థిక సామాజిక వ్యవహారాల నిపుణుడు హమీద్ రషీద్ వివరించారు. పాశ్చాత్య దేశాల సంస్థల నుంచి చైనాకు పెట్టుబడుల రాక తగ్గిందని, భారత్ కు విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోందని అన్నారు.
ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు 6.9 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. అదే సమయంలో చైనా వృద్ధి రేటు 4.8 శాతంగా నమోదవుతుందని అభిప్రాయపడ్డారు.
భారత్ లో ద్రవ్యోల్బణం పరిస్థితులు లేకపోవడం, ఇతర దేశాల తరహాలో ఆర్థిక స్థితి కృత్రిమంగా కనిపించకపోవడం విదేశీ పెట్టుబడుల పెరుగుదలకు ముఖ్య కారణాలు అని హమీద్ రషీద్ పేర్కొన్నారు. అంతర్జాతీయ సంక్షోభాల నేపథ్యంలో, క్రూడాయిల్ ధరతో పాటు, రష్యా నుంచి చమురు దిగుమతుల కోసం చేసుకున్న వ్యూహాత్మక ఏర్పాట్లు కూడా భారత్ కు లాభిస్తున్నాయని వివరించారు.