SIT: ఏపీలో అల్లర్లు: ఏడీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ నియామకం
- ఏపీలో పోలింగ్ అనంతర హింసపై సిట్ వేయాలన్న ఈసీ
- సిట్ ఏర్పాటుపై ఈ రాత్రికి అధికారిక ప్రకటన
- ఇప్పటికే ప్రాథమిక విచారణ మొదలుపెట్టిన సిట్
- రేపటికి ఈసీకి నివేదిక అందించే అవకాశం
- సిట్ నివేదిక ఆధారంగా ఈసీ చర్యలు
ఏపీలో హింసాత్మక ఘటనలపై సిట్ ను వేయాలన్న ఈసీ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. తాజాగా, ఏడీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ను నియమించింది. దీనిపై ఈ రాత్రిలోగా అధికారిక ప్రకటన వెలువడనుంది.
సిట్ ఇప్పటికే ప్రాథమిక విచారణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. సిట్ రేపటిలోగా ఈసీకి నివేదిక ఇవ్వనుంది. ప్రధానంగా పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో జరిగిన ఘటనలపై తన నివేదికలో వివరాలు పొందుపరచనుంది. సిట్ నివేదిక ఆధారంగా ఈసీ తదుపరి చర్యలు తీసుకోనుంది.
సిట్ నివేదిక వచ్చాక, హింసాత్మక ఘటనలకు కారకులైన నేతల అరెస్ట్ జరిగే అవకాశముంది. కొందరు అభ్యర్థులకు కొమ్ము కాసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఘటనలు జరిగిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల గృహనిర్బంధం, ఎమ్మెల్యే అభ్యర్థుల ఇళ్ల వద్ద సాయుధ పోలీస్ పికెట్ల ఏర్పాటు, అదనంగా 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాల మోహరింపు వంటి అంశాలపై ప్రస్తుతం ఈసీ దృష్టి సారించింది.