Botsa Satyanarayana: జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణస్వీకారం చేస్తారు: బొత్స సత్యనారాయణ
- టీడీపీ హింసకు పాల్పడుతోందన్న బొత్స
- అధికారుల మార్పిడి జరిగిన ప్రాంతాల్లోనే అల్లర్లు జరిగాయని విమర్శ
- వైసీపీ 175కి దగ్గరగా సీట్లను గెలవబోతోందని ధీమా
తెలుగుదేశం పార్టీ హింసకు పాల్పడుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వైసీపీ నేతలే దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు. హింసకు వైసీపీ ఎప్పుడూ వ్యతిరేకమేనని... తమపై అనవసర నిందలు వేయొద్దని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం హింసను ప్రేరేపించవద్దని అన్ని పార్టీలను కోరుతున్నామని చెప్పారు. కక్షపూరిత చర్యలకు ప్రతిపక్ష పార్టీలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎన్నికల కమిషన్ నియమించిన ఒక రిటైర్డ్ అధికారి ఏకపక్ష నిర్ణయాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామని బొత్స చెప్పారు. ఎక్కడైతే అధికారుల మార్పిడి జరిగిందో అక్కడే అల్లర్లు జరిగాయని తెలిపారు. పోలీసులు న్యాయంగా వ్యవహరించాలని సూచించారు.
వైసీపీ 175 సీట్లకు దగ్గరగా గెలవబోతోందని బొత్స ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9న విశాఖలో ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని తెలిపారు. విశాఖ కేంద్రంగా జగన్ పాలన ప్రారంభమవుతుందని చెప్పారు. విశాఖలో ప్రశాంతతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం రావాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా తమ పార్టీ సీట్లు అవసరం ఉండేలా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలని ఆశిస్తున్నానని తెలిపారు.