Raghunandan Rao: ఓటుకు రూ.500 పంచారు... మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలి: రఘునందన్ రావు డిమాండ్
- 27 పోలింగ్ బూత్‌లకు పంపిణీ చేసే రూ.84 లక్షలు ఒకే కారులో దొరికాయన్న రఘునందన్ రావు
- తాను ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన
- తెలంగాణ సీఈవో వికాస్ రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ అభ్యర్థి
మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఓటుకు రూ.500 పంచారని, 27 పోలింగ్ బూత్‌లకు పంపిణీ చేసే రూ.84 లక్షలు ఒకే కారులో దొరికాయని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. వెంకట్రామిరెడ్డిని డిస్‌క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రఘునందన్ రావు తెలంగాణ సీఈవో వికాస్ రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తాను ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలింగ్ బూత్‌ల వారీగా లెక్కలు కట్టి ఎన్వలప్ కవర్‌లలో ఒక్కో గ్రామానికి డబ్బులు పంపిణీ చేశారని వెల్లడించారు. 20కి పైగా కార్లు ఉన్నాయని ఫిర్యాదు చేస్తే చేగుంట ఎస్సై ఒక కారును పట్టుకున్నారని... అందులో డబ్బులు దొరికాయన్నారు. సిద్దిపేట సీపీ, మెదక్ ఎస్పీకి సరైన ఆధారాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో హరీశ్ రావు, మరో ఆరుగురు ఎమ్మెల్యేలు డబ్బుల పంపిణీ చేశారని ఆరోపించారు.
కారులో దొరికిన రూ.84 లక్షల డబ్బును వెంకట్రామిరెడ్డి ఖాతాలో వేసి అతనిని డిస్ క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇంకా బీఆర్ఎస్ అధికారంలో ఉందని పోలీసులు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. తనకు ఇక్కడ న్యాయం జరగకపోతే ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేస్తానన్నారు.