Rain Alert: కొనసాగుతున్న ఆవర్తనం, ద్రోణి... ఏపీలో నాలుగు రోజుల పాటు వర్షాలు
- ఏపీలో చల్లబడిన వాతావరణం
- రాయలసీమను ఆనుకుని ఉత్తర తమిళనాడు మీదుగా ఆవర్తనం
- ఛత్తీస్ గఢ్ నుంచి కొమోరిన్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి
ఏపీలో కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండడమే అందుకు కారణం. ఏప్రిల్ నుంచి మే రెండో వారం వరకు మండుటెండలతో అల్లాడిపోయిన ప్రజలు, గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఓ మోస్తరు వర్షాలతో సేదదీరుతున్నారు.
తాజాగా, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) రాష్ట్రానికి వర్ష సూచన చేసింది. ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని వెల్లడించింది. రాయలసీమను ఆనుకుని ఉత్తర తమిళనాడు మీదుగా ఆవర్తనం కొనసాగుతోందని, అదే సమయంలో ఛత్తీస్ గఢ్ నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉన్నట్టు తెలిపింది.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రేపు నెల్లూరు, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, తిరుపతి, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, చిత్తూరు, నంద్యాల, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ వివరించింది.
కోనసీమ, కృష్ణా, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. .