Revanth Reddy: రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
- అవతరణ దినోత్సవం, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, ధాన్యం కొనుగోళ్లు, రుణమాఫీపై చర్చించే అవకాశం
- తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ అంశాలపై సమగ్ర నివేదిక కోసం ఇప్పటికే సీఎం ఆదేశాలు
- రుణమాఫీకి అవసరమైన నిధుల సమీకరణపై చర్చించే అవకాశం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు (శనివారం) కేబినెట్ భేటీ జరగనుంది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం, ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం కింద పెండింగ్లో ఉన్న అంశాలు, రాష్ట్రానికి ఆదాయ వనరులు, ధాన్యం కొనుగోళ్లు, రైతు రుణమాఫీ తదితర అంశాలపై ఈ కేబినెట్ భేటీలో చర్చించనున్నారని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పెండింగ్ అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జూన్ 2వ తేదీ తర్వాత హైదరాబాద్లోని ఏపీకి కేటాయించిన భవనాలను అధీనంలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే ఉద్యోగుల బదిలీలు పూర్తి చేయాలన్నారు.
రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని ప్రకటించినందున... అవసరమైన నిధుల సమీకరణకు ఆదాయ వనరులపై మంత్రివర్గం చర్చించే అవకాశముంది. ఈ మేరకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.