Hepatitis A: కేరళలో పెరుగుతున్న హెపటైటిస్ కేసులు.. ఇప్పటికే 12 మంది మృతి

Alert Issued in Kerala After Hepatitis A Outbreak

  • రాష్ట్రవ్యాప్తంగా 2 వేల మంది బాధితుల గుర్తింపు
  • మలప్పురం, ఎర్నాకులం, కోజికోడ్, త్రిసూర్ లలోనే ఎక్కువ
  • నీటి కాలుష్యం, కలుషిత ఆహారం వల్లే వ్యాపిస్తోందంటున్న వైద్యులు

కేరళలో హెపటైటిస్ ఏ విజృంభిస్తోంది.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దీనిబారిన పడ్డవారి సంఖ్య 2 వేలు దాటింది. ఇప్పటి వరకు హెపటైటిస్ తో మొత్తం 12 మంది చనిపోయారని వైద్యారోగ్య శాఖ తెలిపింది. మలప్పురం, ఎర్నాకులం, కోజికోడ్‌, త్రిసూర్‌లలో ఈ కేసులు పెరుగుతున్నాయి. కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. కలుషిత ఆహారం, కలుషిత నీటి ద్వారా వ్యాప్తి చెందే హెపటైటిస్ ఏ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలంటూ వైద్యారోగ్య సిబ్బందికి సూచించింది. 

హెపటైటిస్ ఏ అంటే..
వైద్య నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. కలుషిత నీరు, కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల హెపటైటిస్ ఏ బారిన పడే ప్రమాదం ఉంది. ఈ వైరస్ కాలేయంపై ప్రభావం చూపిస్తుంది. సకాలంలో చికిత్స అందకపోతే కామెర్లకు దారితీస్తుంది. ఇన్ ఫెక్షన్ ముదిరి కాలేయ వైఫల్యానికి కారణమవుతుందని చెప్పారు. ఆ సందర్భంలో కాలేయ మార్పిడి అవసరమవుతుందని వివరించారు. కొంతమంది బాధితుల్లో హెపటైటిస్ లక్షణాలు పెద్దగా కనిపించవని, వేగంగా కోలుకుంటారని డాక్టర్లు చెప్పారు. మరికొంతమందిలో మాత్రం వ్యాధి తీవ్రమై మరణం సంభవిస్తుందని తెలిపారు.
 
ఒకరి నుంచి మరొకరికి..
హెపటైటిస్ ఏ బాధితులతో సన్నిహితంగా ఉన్న వారికి కూడా వ్యాధి సోకుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన వ్యక్తితో శారీరక సంబంధం ద్వారా హెపటైటిస్ ఏ వచ్చే అవకాశం ఎక్కువన్నారు. రక్త మార్పిడి ద్వారా, గర్భిణి నుంచి పుట్టబోయే పిల్లలకు సంక్రమిస్తుందని చెప్పారు. కాలేయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న వారితో పాటు మద్యపానం అలవాటు ఉన్న వారికి హెపటైటిస్ ఏ తో ముప్పు ఎక్కువని వైద్యులు తెలిపారు. 

లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
హెపటైటిస్ ఏ బాధితులలో అలసట, వికారం, వాంతులు, కడుపు నొప్పి, జ్వరం, చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. రోడ్డు పక్కన అమ్మే చిరుతిళ్లకు దూరంగా ఉండడం, ఆహారం తీసుకోవడానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, నీటిని వేడి చేసి చల్లార్చి తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా హైపటైటిస్ ఏ ను దూరం పెట్టొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News