Haryana: హర్యానాలో టూరిస్టు బస్సులో మంటలు.. 9 మంది సజీవదహనం
- మరో 13 మందికి తీవ్ర గాయాలు.. నూహ్ లో ఘోర దుర్ఘటన
- మథురలోని బృందావనాన్ని సందర్శించి వస్తుండగా ప్రమాదం
- ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు
హర్యానాలోని నూహ్ లో శనివారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కుండ్లీ మానేసర్ పల్వాల్ (కేఎంపీ) ఎక్స్ ప్రెస్ వేపై ఓ టూరిస్టు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 9 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.
మరో 13 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నల్హార్ మెడికల్ కాలేజీకి తరలించారు. యూపీలోని మథుర నుంచి పంజాబ్ లోని జలంధర్ కు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మథురలోని బృందావనాన్ని గత వారం సందర్శించిన పంజాబ్, హర్యానాకు చెందిన భక్తులు తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
బస్సు వెనక భాగంలో మంటలు రావడాన్ని గమనించిన ఓ వాహనదారుడు.. బస్సు డ్రైవర్ ను అప్రమత్తం చేసినట్లు ఓ ప్రయాణికుడు పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు.