YS Sharmila: ఈ విజయం తొలి అడుగు మాత్రమే: షర్మిల
- వివేకా హత్య కేసుపై మాట్లాడవద్దంటూ కడప కోర్టు ఉత్తర్వులు
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన షర్మిల
- కడప కోర్టు ఉత్తర్వులపై నిన్న స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు
- దురాత్ముల మాడు పగిలేలా సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందన్న షర్మిల
- అంతిమంగా న్యాయం వైపే విజయం ఉంటుందని స్పష్టీకరణ
వివేకా హత్య కేసుపై మాట్లాడవద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. షర్మిలకు ఊరటనిస్తూ... కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పూర్తి వాదనలు వినకుండా ఒకరి వాక్ స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను ఎలా హరిస్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దురాత్ముల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా, మాడుపగిలేలా నిన్న వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని షర్మిల వెల్లడించారు. భావ ప్రకటన స్వేచ్ఛపై ఈ రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పికొట్టి ఎప్పటికైనా ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని నిన్న నిరూపణ అయిందని పేర్కొన్నారు. అధికార బలాన్ని ఉపయోగించి మూర్ఖత్వంతో ఇలాంటి చిల్లర కుట్రలు చేసే వారికి ఈ స్టే చెంపపెట్టు అని షర్మిల స్పష్టం చేశారు.
"ఈ విజయం తొలి అడుగు మాత్రమే. రాబోయే రోజుల్లో వివేకా కుటుంబానికి న్యాయం కోసం పోరాటం ఉద్ధృతం చేస్తాం. చిట్టచివరిగా విజయం, నిజం, న్యాయం వైపే ఉంటాయని చూపిస్తాం" అని షర్మిల ఉద్ఘాటించారు.