Raghunandan Rao: పొంగులేటి వియ్యంకుడు అని బీఆర్ఎస్ నేత వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయడం లేదా?: రఘునందన్ రావు
- వెంకట్రామిరెడ్డిని ఎవరు? ఎందుకు? కాపాడుతున్నారని ప్రశ్న
- వెంకట్రామిరెడ్డికి వ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యాలు ఉన్నా అరెస్ట్ చేయడం లేదని మండిపాటు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చాడని వెల్లడి
మెదక్ లోక్ సభ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయాలని తాను డీజీపీకి ఫిర్యాదు చేశానని... ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన పాత్ర ఉందని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ... వెంకట్రామిరెడ్డిని ఎవరు? ఎందుకు? కాపాడుతున్నారని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటికి వియ్యంకుడు అని అరెస్ట్ చేయడం లేదా? అని నిలదీశారు. వెంకట్రామిరెడ్డికి వ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యాలు ఉన్నా అరెస్ట్ చేయడం లేదని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చాడన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకట్రామిరెడ్డికి సంబంధించిన మూడు కోట్లు తరలించినట్లు రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. కానీ ఇప్పటి వరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. వెంకట్రామిరెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయాలన్నారు.