Rain: మూడు ఓవర్లకే వరుణుడు ప్రత్యక్షం... నిలిచిపోయిన సీఎస్కే-ఆర్సీబీ మ్యాచ్
- ఐపీఎల్ లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ × రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సీఎస్కే
- 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసిన బెంగళూరు
- వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం
ఇవాళ బెంగళూరులో సీఎస్కే-ఆర్సీబీ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు కాకూడదని ప్రతి ఒక్క ఆర్సీబీ అభిమాని దేవుడ్ని ప్రార్థిస్తున్నాడంటే అతిశయోక్తి కాదు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో ప్రవేశించాలంటే ఇవాళ మ్యాచ్ పూర్తిగా జరిగి, బెంగళూరు జట్టు సమీకరణాల ప్రకారం విజయం సాధించాలి. కానీ వాతావరణ పరిస్థితులు మరోలా ఉన్నాయి.
మ్యాచ్ ప్రారంభమైన మూడో ఓవర్ కే వాన ప్రత్యక్షం కావడంతో... చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ నిలిచిపోయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకోగా, బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ కు దిగింది.
వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయే సమయానికి బెంగళూరు జట్టు 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 9 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 19 పరుగులు... కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 9 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ సాయంతో 12 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు.