Nagababu: జూన్ 4 తర్వాత వీళ్లందరినీ విశాఖలో ఉన్న ఆ ఆసుపత్రిలో చేర్చాల్సిందే! : నాగబాబు
- కౌంటింగ్ ముగిసేదాకా కూటమి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్న నాగబాబు
- జగన్ ఓ సోషియో పాత్ అని విమర్శలు
- అతడి మానసిక స్థితి నానాటికీ ముదిరిపోతోందని వెల్లడి
- ట్రంప్ లాగా కుర్చీని వదిలే పరిస్థితి కనిపించడంలేదని వ్యాఖ్యలు
- అతడ్ని చూస్తుంటే 'స్పైడర్' సినిమాలో ఎస్జే సూర్య గుర్తొస్తున్నాడని వ్యంగ్యం
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కూటమి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఓ వీడియో సందేశం వెలువరించారు. కౌంటింగ్ ముగిసేదాకా మూడు పార్టీల శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
"రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. దాదాపు 82 శాతం ఓటింగ్ నమోదైంది. ఇంత భారీ ఎత్తున పోలింగ్ జరగడం ప్రజాస్వామ్యంలో శుభపరిణామం. కానీ ఇదే సమయంలో ప్రజలందరం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే... పోలింగ్ తోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి కాలేదు... కౌంటింగ్ కూడా ఉంది. ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండడంతో వైసీపీ అసురగణం ఎంతటి అరాచకాలకు ఒడిగడుతుందో పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో చూశాం.
సైకో పాత్ అనే మాట మనం వింటుంటాం. ఈ జగన్ మోహన్ రెడ్డి కూడా ఆ కోవలోకే వస్తాడో, లేదో తెలియదు కానీ, కచ్చితంగా అతడు ఒక సోషియో పాత్! ప్రజలను కులాలు, వర్గాలు, పార్టీల వారీగా విడదీసి చిచ్చుపెట్టి ఆనందించే రకం. అతడిలో ఆ మానసిక స్థితిని మొదట్లో ఎవరూ గుర్తించలేకపోయారు. ఆ వ్యాధిని తన అసురగణానికి కూడా అంటించాడు.
ఈ సోషియో పాత్ మానసిక స్థితి రోజురోజుకు ముదిరిపోయింది. ఓటమి కనిపిస్తుండడంతో వైసీపీ ముఠాలు ఉన్మాదంతో ప్రజల ఇళ్ల మీద పడి అరాచకం సృష్టిస్తున్నాయి. మాచర్ల ఎమ్మెల్యే సంబంధీకుల ఇళ్లలో పెట్రోల్ బాంబులు దొరికాయంటే... ఫలితాలు వచ్చాక వీళ్లు ఎంత రాక్షసత్వానికి తెగబడబోతున్నారో ప్రజలు గ్రహించాలి. తాడిపత్రిలో పోలీసులు కూడా తమను తాము రక్షించుకోవడానికి అగచాట్లు పడ్డారు.
వైసీపీకి ఓటు వేయలేదని ఇళ్లలోకి చొరబడి మహిళలను, పిల్లలను అందరినీ చావగొట్టే పైశాచికత్వాన్ని పెంచింది ఎవరు? కచ్చితంగా ఈ జగన్ మోహన్ రెడ్డి అనే చెప్పాలి. దాడుల ఘటనల గురించి తెలుసుకుంటూ కూడా షిక్కటి షిరునవ్వులు చిందిస్తున్న వ్యక్తిని ఏమనాలి? మహేశ్ బాబు స్పైడర్ సినిమాలో విలన్ ఎస్జే సూర్య గుర్తొస్తున్నాడు కదూ!
ఎన్నికల అనంతరం ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు హింసను ప్రేరేపించడంలో వైసీపీ ఓటమి కనిపిస్తోంది. రాబోయే ఓటమిని కప్పిపుచ్చుకునేందుకే ఈ దాడులు చేస్తున్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద కూడా భద్రత పటిష్ఠంగా ఉండాలి... అయితే కేంద్ర ప్రభుత్వ బలగాల మూడంచెల భద్రత ఉన్నా గానీ అక్కడ మన కూటమి పార్టీల ప్రతినిధులు నిరంతర పహారా ఉండాలి.
ముఖ్యంగా మన జనసైనికులకు, వీరమహిళలకు నా విజ్ఞప్తి ఏంటంటే... ఎక్కడైతే జనసేన పోటీ చేసిందో, ఆయా ప్రాంతాల్లో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద జనసైనికులు స్వచ్ఛందంగా కాపలాగా కూర్చోవాలి. ఈ అవకాశాన్ని మనం వదులుకోవద్దు, వాడుకుందాం. ఈ వైసీపీ దుర్మార్గులను ఏ దశలోనూ తేలిగ్గా తీసుకోవద్దు. వాళ్లు ఏ అరాచకానికైనా, ఏ దౌర్జన్యానికైనా తెగబడతారు.
ఆ మధ్యన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగితే, డొనాల్డ్ ట్రంప్ కూడా ఇలాంటి లక్షణాలే కనబరిచాడు. ఎన్నికల్లో ఓడిపోతున్నాను అని తెలిశాక కూడా... నేనే గెలుస్తున్నాను, గతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని ప్రచారం మొదలుపెట్టాడు. ఫలితాలు వచ్చాక కూడా నానా యాగీ చేసి కుర్చీని వదిలేందుకు ససేమిరా అంటే, అతడిని వైట్ హౌస్ నుంచి పంపించేశారు. ఇలాంటి లక్షణాలనే మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రదర్శిస్తున్నాడు.
మొన్నటికి మొన్న ఐప్యాక్ మీటింగ్ లో కూడా తన పార్టీయే గెలుస్తుందని చెప్పాడు. అతడి మానసిక స్థితిని ఒంటబట్టించుకున్న ఉత్తరాంధ్ర నాయకుడు ప్రమాణస్వీకారం తేదీ, విశాఖలో స్థలం అన్నీ ప్రకటించేశాడు. జూన్ 4 తర్వాత వీళ్లందరినీ విశాఖలో ఉన్న ఆ ఆసుపత్రిలో చేర్చాల్సిందే!
ట్రంప్ లాగా జగన్ కూడా కుర్చీని వదులుకోవడానికి ఇష్టపడడు. తన ఉన్మాద బృందంతో రాష్ట్రవ్యాప్తంగా దాడులు, హింసకు తెగబడే ప్రమాదం ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి కచ్చితమైన సమాచారం ఉంది. అందుకే వచ్చే నెల 15 వరకు కేంద్ర బలగాలను మోహరించాలని చెప్పింది.
మనవంతుగా కౌంటింగ్ ముగిసేవరకు కౌంటింగ్ కేంద్రాల వద్ద, పార్టీ కార్యాలయాల వద్ద కూటమి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ అరాచకశక్తుల చేతుల నుంచి అభివృద్ధి సాధకుల చేతుల్లోకి వచ్చే సమయం దగ్గర్లోనే ఉంది. అందరం ఆ శుభ ఘడియల కోసం ఎదురుచూద్దాం" అంటూ నాగబాబు పిలుపునిచ్చారు.