Narendra Modi: మూడోసారి మోదీ గెలిచిన ఆరు నెలల్లో పీవోకే మనదే: సీఎం యోగి ఆదిత్యనాథ్

UP CM Yogi Adityanath Said that PoK will become part of India within six months after PM Modi gets elected for third term
  • పీవోకేని రక్షించుకోవడం పాకిస్థాన్‌కు కష్టంగా మారిందన్న బీజేపీ స్టార్ క్యాంపెయినర్
  • మహారాష్ట్ర ఎన్నికల ర్యాలీలో సంచలన వ్యాఖ్యలు    
  • ఉగ్రవాదం, నక్సలిజాన్ని బీజేపీ ప్రభుత్వం ఉపేక్షించబోదన్న సీఎం యోగి
ఉత్తరప్రదేశ్ సీఎం, బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌ యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ఎన్నికైన ఆరు నెలల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) భారత్‌లో అంతర్భాగం అవుతుందని అన్నారు. పీవోకేని రక్షించుకోవడం పాకిస్థాన్‌కు ఇబ్బందికరంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

‘‘ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను కాపాడుకోవడం పాకిస్థాన్‌కు సంక్లిష్టంగా మారింది. మోదీని మూడోసారి ప్రధాని కానివ్వండి. ఆరు నెలల్లో పీవోకే భారత్‌లో భాగమవుతుంది. ఇలాంటి పని చేయాలంటే ధైర్యం ఉండాలి’’ అని సీఎం యోగి అన్నారు. కాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఈ మధ్య పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. స్థానిక ప్రజలు, పాకిస్థాన్ దళాల మధ్య కూడా పలుమార్లు ఘర్షణలు జరిగాయి. దీంతో పాకిస్థాన్ పట్ల అక్కడి ప్రజల్లో వ్యతిరేక భావన నెలకొందనే విశ్లేషణలు మరోసారి ఊపందుకున్న విషయం తెలిసిందే.

ఉగ్రవాదం, నక్సలిజాన్ని సహించబోం..
ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నక్సలిజం, ఉగ్రవాదం అణచివేతకు దృఢమైన వైఖరితో ఉందని, ఈ మేరకు గత 10 ఏళ్లలో కొత్త భారత్‌ను చూశామని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. దేశ సరిహద్దులకు భద్రత కల్పించామని, ఉగ్రవాదం, నక్సలిజం అరికట్టామని అన్నారు. ముంబై పేలుళ్లు జరిగినప్పుడు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం హయాంలో ఉగ్రవాదులు సరిహద్దు దాటి భారత్‌లోకి వచ్చారని విమర్శించారు. మరోవైపు పాకిస్థాన్‌ను పొగిడేవారిపై ఆయన విమర్శల దాడి చేశారు. ‘‘పాకిస్థాన్ మొత్తం జనాభా కంటే ఎక్కువ మందిని ప్రధాని మోదీ పేదరికం నుంచి బయటపడేశారని, ఈ విషయాన్ని పాకిస్థాన్‌ను పొగిడే వారికి చెప్పదలచుకున్నాను’’ అని అన్నారు.
Narendra Modi
Yogi Adityanath
POK
Lok Sabha Polls
BJP

More Telugu News