Ganga river: రీల్స్ చేస్తూ గంగా నదిలో నలుగురు యువకులు గల్లంతు
- నీటి ప్రవాహ ఉధృతిని పసిగట్టకుండా నదిలోకి దిగిన యువకులు
- ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి
- బీహార్‌లోని ఖగారియా జిల్లా విషాదం
బీహార్‌లోని ఖగారియా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గంగానదిలో రీల్స్ చిత్రీకరించే క్రమంలో ప్రమాదవశాత్తూ ఆరుగురు యువకులు నీట మునిగారు. ఇందులో నలుగురు యువకులు గల్లంతు కాగా ఇద్దరిని స్థానికులు రక్షించారు. జిల్లాలోని పర్బట్టా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అగువాని ఘాట్ వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. మైనర్ యువతితో సహా ఆరుగురు రీల్స్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఇద్దరిని స్థానికులు రక్షించగలిగారని చెప్పారు. నీటిలో మునిగిన నలుగురి కోసం ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు అన్వేషించినా ఆచూకీ దొరకలేదని వివరించారు.
నీటి ప్రవాహ ఉధృతిని పసిగట్టలేకపోయారని, ప్రమాదాన్ని గుర్తించక రీల్స్ షూట్ చేసేందుకు నీటిలోకి దిగారని పర్బట్టా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అరవింద్ కుమార్ తెలిపారు. మునిగిపోయినవారి ఆచూకీ కోసం స్థానిక ఈతగాళ్లతో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తోందని ఆయన వివరించారు. గల్లంతైన వారి పేర్లు నిఖిల్ కుమార్ (23), ఆదిత్య కుమార్ (18), రాజన్ కుమార్ (16), శుభం కుమార్ (16)గా వెల్లడించారు. శ్యామ్ కుమార్ (24) అనే యువకుడితో పాటు అతడి సోదరి సాక్షి కుమారి (16) ప్రాణాలతో బయటపడ్డారని వివరించారు.