Swati Maliwal: కేజ్రీవాల్ నివాసంలో సీసీటీవీ ఫుటేజీని సీజ్ చేసిన పోలీసులు!

Police seize CCTV footage from Arvind Kejriwals residence in Swati Maliwal case

  • స్వాతి మలివాల్ కేసులో పోలీసులు సీసీటీవీ కెమెరా ఫుటేజీని సీజ్ చేశారన్న ఆప్
  • తాము ఫుటేజీని డిలీట్ చేసినట్టు పోలీసులు తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తున్నారని ఆరోపణ
  • సీసీటీవీ కెమెరాల నిర్వహణ పీడబ్ల్యూడీ పరిధిలోనిదని వెల్లడి

ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ కేసులో ఢిల్లీ పోలీసులు సీఎం కేజ్రీవాల్ నివాసంలోని సీసీటీవీ ఫుటేజీకి చెందిన డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నారని ఆ పార్టీ ఆదివారం ప్రకటించింది. తమ ప్రతిష్ఠను దెబ్బతీసేలా పోలీసులు లేనిపోని కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. అయితే, దీనిపై ఢిల్లీ పోలీసులు ఇంకా స్పందించలేదు. 

  కేజ్రీవాల్ నివాసంలో ఆయన సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడని ఎంపీ స్వాతి మలివాల్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఏడు సార్లు తన చెంప ఛెళ్లుమనిపించాడని, ఛాతి, ఉదరభాగంలో తన్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడి తరువాత తాను నడవలేక ఇబ్బంది పడ్డానని కూడా ఆమె తెలిపారు. అయితే, స్వాతి ఆరోపణలను ఆప్ ఖండించింది. బీజేపీ ప్రోద్బలంతోనే ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది.  

మరోవైపు, ఢిల్లీ పోలీసులు బిభవ్ కుమార్‌ను అరెస్టు చేయగా న్యాయస్థానం అతడికి ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఇక బిభవ్ కుమార్ కూడా స్వాతిపై ఫిర్యాదు చేశారు. సీఎం నివాసంలోకి ఆమె బలవంతంగా, అనుమతి లేకుండా ప్రవేశించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఈ నేపథ్యంలో ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఆదివారం పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ‘‘ఎంట్రీ గేట్లు, బౌండరీ గోడలపై ఉన్న సీసీటీవీ కెమెరాల డీవీఆర్‌లను శనివారం పోలీసులు సీజ్ చేశారు. మేము సీసీటీవీ ఫుటేజీని డిలీట్ చేసినట్టు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు’’ అని అన్నారు. కెమెరాల నిర్వహణ అంతా పీడబ్ల్యూడీ పరిధిలోనిదని చెప్పారు. ఈ కేసులో రిజిస్టరైన ఎఫ్‌ఐఆర్ కాపీ బహిర్గతమైందని పేర్కొన్నారు. కానీ కేసులో నిందితుడు, పార్టీ వద్దకు ఎఫ్ఐఆర్ కాపీ రాలేదన్నారు.

  • Loading...

More Telugu News