Pithapuram: కౌంటింగ్ నేపథ్యంలో పిఠాపురం, కాకినాడలో హింసకు అవకాశం... నిఘా వర్గాల నివేదిక!
- ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు పోలింగ్
- జూన్ 4న ఓట్ల లెక్కింపు
- ఇంటెలిజెన్స్ నివేదిక నేపథ్యంలో అప్రమత్తమైన ఈసీ
- కాకినాడ, పిఠాపురంలో భారీ బందోబస్తుకు చర్యలు
ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగ్గా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ తేదీ దగ్గరపడుతుండడంతో రాజకీయ పార్టీల్లో టెన్షన్ పెరుగుతోంది. అదే సమయంలో ఏపీ ఎన్నికల ఫలితాల కోసం ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో, ఈసీకి నిఘా వర్గాల నుంచి కీలక నివేదిక అందింది. కౌంటింగ్ నేపథ్యంలో పిఠాపురం, కాకినాడ నగరంలో హింస చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయన్నది ఆ నివేదిక సారాంశం. కౌంటింగ్ కు ముందు, తర్వాత హింసాత్మక ఘటనలు జరిగే అవకాశముందని ఇంటెలిజెన్స్ విభాగం పేర్కొంది.
ఈ నివేదికను దృష్టిలో ఉంచుకుని, కాకినాడలోని ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేటపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. 2019 ఎన్నికల్లోనూ, ఇటీవలి పోలింగ్ సందర్భంగా గొడవలకు దిగిన, ప్రేరేపించిన వ్యక్తులపై పోలీసులు నిఘా ఉంచారు. సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఏపీఎస్పీ, ఏఆర్, సివిల్ పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
ఇక పిఠాపురం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయడంతో ఇక్కడ కూడా పటిష్ఠమైన భద్రత కల్పించే దిశగా ఈసీ చర్యలు తీసుకుంటోంది.
కాకినాడ అసెంబ్లీ స్థానంలో అధికార వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా వనమాడి కొండబాబు పోటీ చేశారు. కాకినాడ ఎంపీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ పోటీ చేయగా, జనసేన తరఫున తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేశారు.
పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పవన్ కల్యాణ్, వైసీపీ అభ్యర్థిగా వంగా గీత పోటీ చేశారు.