Royal Challengers Bengaluru: ఆర్సీబీ డ్రెస్సింగ్ రూంలోకి వచ్చిన లెజెండ్ క్రిస్ గేల్ తో కింగ్ కోహ్లీ సరదా సంభాషణ.. వీడియో వైరల్
- ‘కాకా.. వచ్చే ఏడాది ఐపీఎల్ లోకి తిరిగి వచ్చెయ్’ అంటూ సూచన
- ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తే ఫీల్డింగ్ చేయాల్సిన అవసరం లేదంటూ కోహ్లీ చమత్కారం
- యూనివర్స్ బాస్ తన కింగ్ డమ్ లోకి వచ్చాడంటూ ఆటగాళ్ల కామెంట్
- వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఆర్సీబీ యాజమాన్యం
ఐపీఎల్ గత ఎడిషన్ లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన వెస్టిండీస్ మాజీ ఆటగాడు, డ్యాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ తాజాగా ఆర్సీబీ డ్రెస్సెంగ్ రూంలో సందడి చేశాడు. జట్టులోని ఆటగాళ్లందరినీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ పలకరించాడు. ఈ సందర్భంగా క్రిస్ గేల్ తో విరాట్ కోహ్లీ కాసేపు సరదాగా ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ యాజమాన్యం తమ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఆ వీడియోలో డ్రెస్సింగ్ రూంలోకి గేల్ రాగానే అందరూ యూనివర్స్ బాస్ వచ్చాడంటూ కితాబునిచ్చారు. అనంతరం హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ ను పలకరించాడు. ఆ తర్వాత కోహ్లీని కలిశాడు. తాను ఈ సీజన్ లో అత్యధికంగా 37 సిక్స్ లు బాదినట్లు కోహ్లీ ఈ సందర్భంగా గేల్ కు చెప్పుకొచ్చాడు. క్రిస్ గేల్ ను కాకా అంటూ ముద్దుపేరుతో సంబోధిస్తూ వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ తరఫున తిరిగి బరిలోకి దిగాలని కోరాడు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన అమల్లో ఉన్నందున 12వ ఆటగాడిగా బ్యాటింగ్ కు దిగాలని సరదాగా సూచించాడు. పైగా ఈ నిబంధన ప్రకారం ఫీల్డింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పుకొచ్చాడు. ఈ నిబంధన నీ కోసమే ఉందంటూ ఆటపట్టించాడు. దీంతో గేల్ పెద్దగా నవ్వాడు.
అనంతరం కోహ్లీతోపాటు ఇతర ఆటగాళ్లతో కలసి గేల్ ఫొటోలకు పోజులిచ్చాడు. డ్రెస్సింగ్ రూంలోంచి తిరిగి వెళ్లే ముందు గేల్ కు కోహ్లీ తన జెర్సీపై సంతకం చేసి కానుకగా ఇచ్చాడు. ‘క్రిస్ (కాకా) విత్ లవ్ అండ్ బెస్ట్ విషెస్’ అని జెర్సీపై రాసి స్వయంగా అందించాడు. ఇందుకు గేల్ కృతజ్ఞతలు తెలిపాడు. గదిలోంచి వెళ్లేటప్పుడు గేల్ ఓ కూనిరాగం తీస్తూ వెళ్లిపోయాడు.
ఈ వీడియోను సోమవారం ఉదయాన్నే ఆర్సీబీ యాజమాన్యం ‘ఎక్స్’లో షేర్ చేయగా మధ్యాహ్నానికే 1.27 లక్షలకుపైగా వ్యూస్ లభించాయి. కోహ్లీ, గేల్ ముచ్చట్లను చూసి ఆర్సీబీ ఫ్యాన్స్ తెగ ఆనందపడ్డారు.