Malika Garg: పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మలికా గార్గ్
- ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు
- ఎస్పీ బిందు మాధవ్ ను సస్పెండ్ చేసిన ఈసీ
- నూతన ఎస్పీగా మలికా గార్గ్ నియామకం
- రాజకీయ నేతలైనా, పోలీసులైనా గీత దాటితే చర్యలు తప్పవని గార్గ్ హెచ్చరిక
మహిళా ఐపీఎస్ అధికారి మలికా గార్గ్ నేడు పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఎన్నికల హింస నేపథ్యంలో, పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన స్థానంలో మలికా గార్గ్ ను కొత్త ఎస్పీగా నియమించింది.
ఇవాళ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎస్పీ మలికా గార్గ్ మాట్లాడుతూ, జూన్ 4న కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడడం నా మొదటి లక్ష్యం అని స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో శాంతిభద్రతలు కాపాడడంపై ప్రధానంగా దృష్టి సారిస్తానని తెలిపారు.
ఇటీవల కొన్ని ఘటనల కారణంగా పల్నాడులో శాంతిభద్రతలు అదుపు తప్పాయని అన్నారు. రాజకీయ పార్టీల నాయకులు చట్టాన్ని అతిక్రమిస్తే కఠినచర్యలు తప్పవని మలికా గార్గ్ హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో ప్రశాంతత నెలకొల్పడానికి కృషి చేస్తానని చెప్పారు. పోలీసు అధికారులు తప్పు చేస్తే ఉపేక్షించబోనని, కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.