Jani Master: రేవ్ పార్టీలో తాను కూడా ఉన్నానంటూ వస్తున్న వార్తలపై జానీ మాస్టర్ వివరణ

Jani Master explains where he was exactly while Bengaluru police busted a rave party

  • బెంగళూరులో రేవ్ పార్టీ
  • పలువురు సినీ ప్రముఖులు ఉన్నారంటూ వార్తలు
  • నటుడు శ్రీకాంత్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఉన్నారంటూ ప్రచారం
  • హైదరాబాదులో తమ యూనియన్ ఆఫీసు నుంచి వీడియో విడుదల చేసిన జానీ 

బెంగళూరులో పోలీసులు ఓ రేవ్ పార్టీని భగ్నం చేయగా, పలువురు తెలుగు సినీ ప్రముఖులు, బడాబాబులు పట్టుబడ్డారని వార్తలు వచ్చాయి. సీనియర్ నటుడు శ్రీకాంత్ దొరికాడని కొన్ని వార్తలు వచ్చాయి. వీడియోలో కనిపించిన వ్యక్తి తాను కాదంటూ శ్రీకాంత్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన నేత జానీ మాస్టర్ కూడా రేవ్ పార్టీలో పట్టుబడి పవన్ కల్యాణ్ పరువు తీశాడని సోషల్ మీడియాలో మోతమోగిపోయింది. 

దీనిపై జానీ మాస్టర్ ఓ వీడియోతో వివరణ ఇచ్చారు. తాను హైదరాబాదులోనే ఉన్నాననేందుకు సాక్ష్యంగా తెలుగు ఫిలిం, టీవీ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆ వీడియోను చిత్రీకరించారు. తన చాంబర్ ను చూపించడంతో పాటు, అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ కొరియోగ్రాఫర్, దివంగత ముక్కు రాజు ఫొటోను కూడా జానీ మాస్టర్ కెమెరాకు చూపించారు. 

"అందరికీ నమస్కారం... నేను ప్రస్తుతం హైదరాబాదులోని మా యూనియన్ ఆఫీసులో ఉన్నాను. నన్ను అభిమానించే నా తమ్ముళ్లు, నా అన్నలకు చెబుతున్నా... నేను రేవ్ పార్టీలో ఉన్నానంటూ ప్రచారం జరుగుతోంది. అలాంటిదేమీ లేదు. ఇటీవలి వరకు ఎన్నికలతో నేను బిజీగా ఉన్నాను. హైదరాబాదులో మా డ్యాన్సర్స్ యూనియన్ లో కొన్ని పనులు ఆగిపోతే వాటి విషయం చూస్తున్నాను. అలాగే, నా స్నేహితులకు కొందరికి ఆరోగ్యం బాగా లేకపోతే ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించాను. వాళ్ల మంచీ చెడులు చూసుకుంటున్నాను. 

డైరెక్టర్స్ డే నేపథ్యంలో నిన్న రాత్రి ఓ నిధుల సేకరణ కార్యక్రమం జరిగితే ఆ షోలో కూడా నేను ఉన్నాను. అది లైవ్ వచ్చింది. వేసవి సెలవుల్లో మా పిల్లలను బయటికి తీసుకెళ్లడానికి కూడా నాకు టైమ్ లేదు... అలాంటిది నేను రేవ్ పార్టీకి వెళ్లానంటున్నారు. నేను ఎక్కడికీ వెళ్లలేదు... హైదరాబాదులో మా యూనియన్ ఆఫీసులోనే ఉన్నాను. 

జూన్ 4న మేం పార్టీ చేసుకుంటాం... మేమే కాదు ఏపీలో ప్రతి ఇంట్లో ఆ రోజున పండుగ చేసుకుంటారు" అంటూ జానీ మాస్టర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News