Gallbladder Stones: కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన మహిళ.. ఆపరేషన్ చేసి 570 రాళ్లను తొలగించిన వైద్యులు
- అమలాపురం ఏఎస్ఏ ఆసుపత్రి వైద్యుల ఘనత
- బాధితురాలు కోలుకుంటోందని వివరించిన డాక్టర్లు
- అరుదైన శస్త్రచికిత్స గురించి మీడియాకు వెల్లడి
కడుపునొప్పితో బాధపడుతున్న ఓ మహిళ ఆసుపత్రికి వెళ్లింది.. ఆమెను పరీక్షించిన వైద్యులు గాల్ బ్లాడర్ లో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ చేసి మహిళ కడుపులో నుంచి 570 రాళ్లను తొలగించారు. ఈ అరుదైన ఆపరేషన్ ను అమలాపురంలోని ఏఎస్ఏ ఆసుపత్రి వైద్యులు నిర్వహించారు. ఈ నెల 18న ఆపరేషన్ జరగగా.. ప్రస్తుతం బాధితురాలు కోలుకుంటోందని వివరించారు. ఈ అరుదైన ఆపరేషన్ వివరాలను ఏఎస్ఏ ఆసుపత్రి వైద్యులు మీడియాకు వివరించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణానికి చెందిన జాలెం నరసవేణి (31) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. భోజనం చేశాక నొప్పి ఎక్కువ అవుతుండడంతో భరించలేక వైద్యులను ఆశ్రయించింది. దేవగుప్తం ఆసుపత్రిలో చూపించుకోగా.. అక్కడి వైద్యులు అమలాపురంలోని ఏఎస్ఏ ఆసుపత్రికి రిఫర్ చేశారు. నరసవేణిని పరీక్షించిన ఏఎస్ఏ వైద్యులు.. స్కానింగ్ లో గాల్ బ్లాడర్ లో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ చేసి వాటిని తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు. డాక్టర్ నర్రా శ్రీనివాసులు, డాక్టర్ అంజలి నేతృత్వంలో ఈ నెల 18న అరుదైన ఆపరేషన్ నిర్వహించి పేషెంట్ నరసవేణి గాల్ బ్లాడర్ నుంచి 570 రాళ్లను వెలికి తీశారు.