Arogya Sree: ఏపీ ప్రభుత్వ బకాయిలపై ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం అధ్యక్షుడు నరేందర్ రెడ్డి స్పందన
- ఏపీలో నిలిచిపోనున్న ఆరోగ్యశ్రీ సేవలు
- భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం
- ఆసుపత్రుల నిర్వహణ ఇబ్బందికరంగా మారిందన్న నరేందర్ రెడ్డి
- వైద్య పరికరాలు పంపిణీ చేసిన వారి నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నామని వెల్లడి
ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలపై ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం అధ్యక్షుడు బూసిరెడ్డి నరేందర్ రెడ్డి స్పందించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు గత ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించారు. ఒప్పందం ప్రకారం 45 రోజుల్లో బిల్లులు చెల్లించాలని, కానీ ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో ఆసుపత్రుల నిర్వహణ ఇబ్బందికరంగా ఉందని అన్నారు.
వైద్య ఉపకరణాలు పంపిణీ చేసిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. బకాయిలు చెల్లించాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశామని నరేందర్ రెడ్డి చెప్పారు. బకాయిలు రాకపోవడంతో ఇప్పటికే కొన్ని ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల సంఘాలు నోటీసులు ఇచ్చాయని తెలిపారు. ఆరోగ్యశ్రీ కొత్త పథకమేమీ కాదని, ఇది ఎన్నికల కోడ్ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు.
బిల్లులు చెల్లించని నేపథ్యంలో, ఏపీలో మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఇప్పటికే ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) హెచ్చరించిన సంగతి తెలిసిందే. తమకు ప్రభుత్వం నుంచి రూ.1,500 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వానికి 'ఆశా' లేఖ రాసింది.