Harbhajan Singh: 'నాకు క్రికెట్ ఎంతో ఇచ్చింది.. ఎంతోకొంత తిరిగి ఇవ్వాలి'.. టీమిండియా కోచ్ పదవిపై భజ్జీ
- టీ20 ప్రపంచకప్ 2024తో ముగుస్తున్న ప్రస్తుత కోచ్ ద్రావిడ్ పదవీకాలం
- ఈ నేపథ్యంలోనే ఇటీవల హెడ్ కోచ్ పోస్టుకు బీసీసీఐ దరఖాస్తులకు ఆహ్వానం
- 'మెన్ ఇన్ బ్లూ'కు కోచింగ్ ఇచ్చే అవకాశం వస్తే సంతోషిస్తానంటున్న హర్భజన్
భవిష్యత్తులో టీమిండియా క్రికెట్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని మాజీ క్రికెటర్, స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ హింట్ ఇచ్చారు. ఒకవేళ తనకు 'మెన్ ఇన్ బ్లూ'కు కోచింగ్ ఇచ్చే అవకాశం వస్తే.. తనకు ఎంతో ఇచ్చిన క్రికెట్‌కు, ఎంతోకొంత తిరిగి ఇచ్చే అవకాశం దొరుకుతుందన్నారు.
కాగా, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పురుషుల జాతీయ జట్టు ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించిన వారం తర్వాత హర్భజన్ ప్రకటన రావడం గమనార్హం. ఇక ప్రస్తుతం టీమిండియా కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవీకాలం 2024 టీ20 వరల్డ్‌కప్‌తో ముగుస్తుంది. అంటే జూన్ చివరి నాటికి ద్రావిడ్ కోచ్‌గా వైదొలుగుతారు. అందుకే కొత్త కోచ్ కోసం బీసీసీఐ తాజాగా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు ఆఖరి గడువు మే 27 సాయంత్రం 6 గంటల వరకు ఉంది.
కాగా, కొత్త కోచ్ పదవీ కాలం ఈ ఏడాది జులై 1 నుండి ప్రారంభమై 2027 డిసెంబర్ 31తో ముగుస్తుందని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది. అంటే టీమిండియాకు- కొత్తగా కోచ్ పదవికి ఎంపికయిన వ్యక్తి 2027 వన్డే ప్రపంచకప్ వరకు భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా కొనసాగుతాడు.
ఈ నేపథ్యంలో భారత జట్టుకు కోచింగ్ ఇవ్వడం గురించి ఏఎన్ఐతో హర్భజన్ మాట్లాడుతూ.. "నేను దరఖాస్తు చేస్తానో లేదో నాకు తెలియదు. కానీ, టీమిండియాకు కోచింగ్ అనేది మ్యాన్ మేనేజ్మెంట్. భారత ఆటగాళ్లకు క్రికెట్ గురించి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు. క్రికెట్ వారికి బాగా తెలుసు. వారికి మార్గదర్శకత్వంగా ఉంటే చాలు. నాకు క్రికెట్ ఎంతో ఇచ్చింది. కోచ్ రూపంలో ఎంతోకొంత తిరిగి ఇచ్చే అవకాశం వస్తే సంతోషిస్తా" అని భజ్జీ చెప్పుకొచ్చాడు. ఇదిలాఉంటే.. టీమిండియాకు హెడ్‌కోచ్ రేసులో గౌతం గంభీర్, స్టీఫెన్ ఫ్లెమింగ్, జస్టిన్ లాంగర్, పాంటింగ్, నెహ్రా, జయవర్దనే ఉన్నారని వార్తలు వస్తున్నాయి.